బనగానపల్లెలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

పేదలకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం: మంత్రి

క్యాంటీన్‌లో స్వయంగా ఆహారం వడ్డించిన మంత్రి, కలెక్టర్

ప్రజలతో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించిన మంత్రి, కలెక్టర్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో (బనగానపల్లె) / మే 02  :

పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. శనివారం బనగానపల్లె పట్టణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా గారితో కలిసి మంత్రి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ క్యాంటీన్ ప్రారంభించామన్నారు. సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉపశమనం కలిగించే విధంగా అన్న క్యాంటీన్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండేలా శుభ్రత, నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ ఆహారాన్ని అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం మంత్రి మరియు జిల్లా కలెక్టర్ స్వయంగా పేద ప్రజలకు ఆహార పదార్థాలను వడ్డించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సామాన్య ప్రజలతో కలిసి భోజనం చేసి, అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు క్యాంటీన్ సదుపాయంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు.

Scroll to Top