100 రోజుల కార్యాచరణతో భూగర్భ జలాల పెంపుదలపై దృష్టి

నీటి ఎద్దడి నివారణకు జలధార–జలహారతి కీలకం

రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 06  :

రాష్ట్రంలో నీటి భద్రతను బలోపేతం చేయడంతో పాటు భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “జలధార–జలహారతి” కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ పేర్కొన్నారు. సోమవారం పాణ్యం మండలం సుగాలిమెట్ట గ్రామంలో నిర్వహించిన “జలధార – నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో మంత్రి, జిల్లా కలెక్టర్ కలిసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ప్రారంభమైన ఈ కార్యక్రమం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికగా కొనసాగుతుందని తెలిపారు. చెరువులు నింపడం, ఫీడర్ ఛానల్స్ మరియు వాగుల డీసిల్టింగ్ ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పాణ్యం మండలంలో నీటి ఎద్దడి సమస్య ఉన్నప్పటికీ, సిమెంట్ నగర్ ప్రాంతం పైభాగంలో కురిసే వర్షపు నీరు కిందకు చేరి చెరువులను నింపుతుందని వివరించారు. ఈ నీటి వనరులపై తాగునీటి అవసరాలు మాత్రమే కాకుండా పశువులు, పక్షులు కూడా ఆధారపడుతున్నాయని తెలిపారు. గతంలో వర్షాధారంగా మాత్రమే చెరువులు నిండేవని, ప్రస్తుతం నీటి నిర్వహణ చర్యల వల్ల ఆ ప్రాంతాలు సస్యశ్యామలంగా మారి మూడు పంటలు పండుతున్నాయని, గ్రామాల అభివృద్ధి గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ భూగర్భ జలాల మట్టం ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా పాపిలి మండలంలో 20 మీటర్లకు పైగా లోతులో నీరు ఉండగా, 8 నుంచి 20 మీటర్ల మధ్య నీటి మట్టం ఉన్న మండలాలు తొమ్మిది ఉన్నాయని తెలిపారు. మొత్తం 165 గ్రామాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. గత 10 సంవత్సరాల హైడ్రోగ్రాఫిక్ విశ్లేషణ ఆధారంగా నీటి కొరత ఉన్న గ్రామాలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని తెలిపారు. పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థాయిని నిరంతరం పరిశీలిస్తూ శాస్త్రీయ విధానంలో చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి సామూహిక బాధ్యత అని స్పష్టం చేస్తూ, ప్రజలు, రైతులు, వాటర్ యూజర్ అసోసియేషన్లు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచాలని సూచించారు.

ముఖ్యమంత్రి ప్రతిపాదించిన “3 మీటర్లు – 8 మీటర్ల కాన్సెప్ట్” ప్రకారం, వర్షాకాలం అనంతరం భూగర్భ జలాల మట్టం 3 మీటర్లకు పైగా ఉండేలా, ఎండాకాలంలో 8 మీటర్ల కంటే దిగువకు పడిపోకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గ స్థాయిలో నీటి ఎద్దడి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ స్పష్టం చేశారు.

Scroll to Top