
నంద్యాల జిల్లా / డిసెంబర్ 31 – 2025 / సత్యం వార్త ప్రతినిధి :
2025 సంవత్సరంలో నంద్యాల జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పరిపాలన రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందని జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి అన్నారు. ప్రజలకు చేరువైన పరిపాలనతో జిల్లాలోని సమస్యలకు వేగవంతమైన పరిష్కార మార్గాలు చూపడమే లక్ష్యంగా పాలన కొనసాగించామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా క్షేత్రస్థాయిలో పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టామని తెలిపారు. ప్రతి నెల ఒకటవ తేదీనే 97 శాతం వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ విజయవంతంగా చేపట్టినట్లు వెల్లడించారు.
వ్యవసాయ రంగంలో సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 65 వేల హెక్టార్ల సాగు విస్తీర్ణాన్ని పెంచినట్లు తెలిపారు. ఉద్యాన పంటల అభివృద్ధిలో భాగంగా సాధారణ పండ్ల తోటల విస్తీర్ణానికి అదనంగా 10 వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగును విస్తరించామని, నూతనంగా ఆయిల్ ఫామ్, యాపిల్ వంటి పంటల సాగును జిల్లాలో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. చేపల ఉత్పత్తి రంగంలో 44 వేల మెట్రిక్ టన్నుల నుంచి 67 వేల మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తిని పెంచినట్లు తెలిపారు.
పరిశ్రమల రంగంలో ఈ ఏడాది రెండు నూతన సిమెంట్ పరిశ్రమలను… అల్ట్రాటెక్, రామ్కో ఫ్యాక్టరీలను జిల్లాకు తీసుకువచ్చామని తెలిపారు. అలాగే రూ.78.87 కోట్ల పెట్టుబడితో 1,476 సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి 5,560 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు వివరించారు. పర్యాటక రంగాభివృద్ధిలో భాగంగా శ్రీశైలంలో శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారి సహకారంతో నూతన ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టామని, దైవిక్ హోటల్, విటిఎస్ హాస్పిటాలిటీ సంస్థల ద్వారా మరో రెండు హోటళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి దాదాపు 15 వేల ఎకరాల భూమిని కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. గిరిజనుల జీవన ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించి, గిరిజన ప్రాంతాల్లోని చెంచులు, యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధి కల్పనలో భాగంగా జిల్లాలో 60 జాబ్ మేళాలు నిర్వహించి 5,285 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వ, కార్పొరేట్ సామాజిక నిధులతో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టామని పేర్కొన్నారు.
జాతీయ రహదారులు 167కె, 340బి, 340సి నిర్మాణాలకు సంబంధించి 100 శాతం భూసేకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. మోంథా తుఫాను సమయంలో తక్షణ చర్యలు చేపట్టి ప్రజలను రక్షించినట్లు వివరించారు. పిజిఆర్ఎస్ను పగడ్బందీగా నిర్వహిస్తూ ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తున్నామని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రజల సంతృప్తి స్థాయిని పెంపొందించామని తెలిపారు.
కాగిత పాలనకు స్వస్తి చెప్పి జిల్లా స్థాయిలో 100 శాతం ఈ-ఆఫీస్ ద్వారా ఫైళ్ల పరిష్కారం జరుగుతోందని, డివిజన్, మండల కేంద్రాల్లోనూ ఈ-ఆఫీస్ పూర్తిస్థాయిలో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శాఖల మధ్య సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని, పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఇనిషియేటివ్స్, మొక్కల నాటకం, రెడ్ క్రాస్ కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగం చురుకుగా పాల్గొంటోందని చెప్పారు. ఫీల్డ్ విజిట్స్, గ్రామస్థాయి పర్యటనల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల సమర్థ అమలులో జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని పేర్కొన్న కలెక్టర్, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 2026లో మరింత అభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
