భూగర్భజలాల పెంపుదలకు 100 రోజుల ప్రత్యేక డ్రైవ్

జలధార కార్యక్రమంతో నీటి భద్రతపై దృష్టి

శాస్త్రీయ మ్యాపింగ్‌తో నీటి వనరుల గుర్తింపు

జిల్లా నుంచి గ్రామ స్థాయికి కమిటీల ఏర్పాటు

సాగునీటి సంఘాల ద్వారా నీటి నిర్వహణ బలోపేతం

వేసవి పరిస్థితుల దృష్ట్యా నీటి సంరక్షణ చర్యలు

  • జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 04  :

జిల్లాలో భూగర్భజలాల స్థాయిని పెంపొందించేందుకు క్షేత్రస్థాయి పరిశీలన, శాస్త్రీయ మ్యాపింగ్, వర్షపు నీటి నిల్వ, కృత్రిమ రీఛార్జ్ చర్యలు మరియు ప్రజల భాగస్వామ్యంతో కూడిన సమగ్ర ప్రణాళికలను అమలు చేయడం అత్యవసరమని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో భూగర్భజలాల పెంపుదలపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో “జలధార” కార్యక్రమం మరియు “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ఏప్రిల్ 6 నుండి జూలై 14 వరకు 100 రోజుల ప్రత్యేక డ్రైవ్‌గా కార్యక్రమాన్ని అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హైడ్రోజియోలాజికల్ మ్యాపింగ్ ద్వారా భూగర్భ జలాశయాల స్థితిని అంచనా వేసి, సర్వే నంబర్ల వారీగా నీటి వనరులు, వాగులు, వంకలను ఖచ్చితంగా గుర్తించాలన్నారు. పనుల పురోగతిని ప్రతిరోజూ, ప్రతి వారం ఫోటోలతో సహా నివేదించాలన్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేయాలని వాటర్ రిసోర్సెస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 261 సాగునీటి సంఘాలు ఉన్నాయని, వాటి ద్వారా నీటి వినియోగం, నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని తెలిపారు. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు.

డోన్ నియోజకవర్గం పూర్తిగా వర్షాధారిత ప్రాంతం కావడంతో, భూగర్భజలాల స్థాయి పెంపుకు సాంకేతికంగా అనుకూలమైన పనులు చేపట్టాలని చెప్పారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కాలువల చివరి ప్రాంతం (టెయిల్ ఎండ్) కావడంతో, ఉపాధి హామీ పథకం ద్వారా కాలువల పూడికతీత పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భూగర్భజలాల పెంపుదల కోసం చెక్ డ్యామ్‌లు, చెక్ వాల్స్, పర్కోలేషన్ ట్యాంకులు, ఫార్మ్ పాండ్స్, డగౌట్ పాండ్స్, కాంటూర్ ట్రెంచెస్, రాక్ ఫిల్ డ్యామ్స్ వంటి పనులను ప్రాధాన్యంగా చేపట్టాలని తెలిపారు. ఈ పనులకు నాబార్డ్, ఏపిడబ్ల్యూడీ వంటి సంస్థల ద్వారా ఆర్థిక సహకారం పొందే అవకాశముందని పేర్కొన్నారు. సాంకేతికత వినియోగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, APWRMS యాప్ ద్వారా గ్రామ నీటి భద్రతా ప్రణాళికలు, బడ్జెట్లు సిద్ధం చేయాలని సూచించారు. పనులన్నింటినీ జియో ట్యాగింగ్ చేసి, ‘బిఫోర్’ మరియు ‘ఆఫ్టర్’ ఫోటోలతో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

వాటర్ రిసోర్సెస్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ వంటి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, మండల స్థాయిలో సాంకేతిక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి మండలానికి బాధ్యతాయుత అధికారులను నియమించి, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ బలోపేతం చేయాలని చెప్పారు. వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణ, పశువులకు నీరు మరియు పచ్చగడ్డి లభ్యత, నీటి కుంటల అభివృద్ధి వంటి అంశాలపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఏప్రిల్ 16 నుండి 20 తేదీల మధ్య పనులకు సంబంధించిన అన్ని అనుమతులను పూర్తిచేసి, అనంతరం ఏప్రిల్ 21 నుండి జూలై 9 వరకు చేపట్టిన పనులన్నీ పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తూ, జల్ శక్తి అభియాన్, ఉపాధి హామీ పథకం వంటి పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అన్ని శాఖల సమిష్టి కృషితో భూగర్భజలాల పెంపుదల సాధ్యమవుతుందని, దీని ద్వారా రైతులకు, గ్రామీణ ప్రాంతాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని కలెక్టర్ తెలిపారు.

Scroll to Top