ఇది గెలుపా…లేక మరోసారి ద్రోహమా…?
- రామినేని రాజునాయుడు:- రాయలసీమ యూత్ యూనియన్ (ఆర్.వై.యూ) అధ్యక్షులు. నంద్యాల


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 04 :
అమరావతిని “5 కోట్ల ఆంధ్రుల గెలుపు”గా చూపిస్తూ సంబరాలు చేస్తున్నారు. కానీ రాయలసీమలో మాత్రం అదే కరువు, అదే వలసలు, అదే నిరుద్యోగం.
ఒక ప్రాంతంలో వేడుకలు జరుగుతుంటే,మరో ప్రాంతం జీవన పోరాటం చేస్తోంది.ఈ గెలుపులో రాయలసీమ ఎక్కడ ఉంది?
రెండు పార్టీల రాజకీయాలు…రాయలసీమకు నష్టం.
ఒక పార్టీ అమరావతి పేరుతో వనరులు కేంద్రీ కరిస్తోంది.మరో పార్టీ మూడు రాజధానులు అంటూ ఆశచూపించి,కర్నూలుకు ఇచ్చిన హామీని నిలబెట్టలేదు.
మాటలు మారాయి,ప్రభుత్వాలు మారాయి…కానీ రాయ లసీమ పరిస్థితి మాత్రం మారలేదు.చివరికి రెండు పార్టీల ఆటలో నష్టపోయింది ఒక్క రాయలసీమే.
దశాబ్దాలుగా ప్రాజెక్టులు పెండింగ్… కొత్త ప్రాజెక్టులు కరువు.
రాయలసీమలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదు.కొత్తగా పెద్ద ప్రాజెక్టులు మొదలు పెట్టే చిత్తశుద్ధి కూడా కనిపించడం లేదు. రైతుకు నీరు రాక, యువతకు అవకాశాలు లేక , అవే కష్టాలు తిరుగుతున్నాయి.
ఉద్యమాలు అందరివి…లాభాలు కొందరివి.
ఒకప్పుడు “”నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ “” కోసం “ఆంధ్రుల ప్రాజెక్టు” అంటూ అందరిని ఉద్యమాల్లో పాల్గొనించారు. “”విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ “” కోసం రాష్ట్రం మొత్తం పోరాడింది. శ్రీశైలం డ్యాం కోసం రాయలసీమ ప్రజలు భూములు కోల్పోయారు.
కానీ చివరికి ప్రయోజనాలు కొందరికి…రాయలసీమకు మాత్రం శూన్యం.
“ఇది అభివృద్ధి కాదు… ప్రాంతీయ ద్రోహం”
అందరి పేరుతో ఉద్యమాలు చేయించి, చివరికి లాభాలు ఒకే ప్రాంతానికి మళ్లిస్తే — అది అభివృద్ధి కాదు. అది బలవంతులు తమ ప్రయోజనం చూసుకునే రాజకీయ వ్యవస్థ. రాయలసీమను ఉపయోగించుకుని, తర్వాత పక్కన పెట్టే ఈ విధానం ఎప్పటికైనా ప్రశ్నించాల్సిందే.
