ప్రాజెక్టు జలధార అమలుపై పటిష్ట ప్రణాళిక రూపొందించండి


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 02 :
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై సానుకూల ప్రజాభిప్రాయం పెంపుదలకు ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు, ‘ప్రాజెక్టు జలధార’ అమలును సమర్థవంతంగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రజా సానుకూలత మరియు ప్రాజెక్టు జలధార అమలుపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సానుకూల ప్రజాభిప్రాయం పెంపుదలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఈ మేరకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజాసానుకులత పెంపుపై ప్రత్యేక చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆరోగ్య శాఖలో సెకండరీ హెల్త్ సేవల పరంగా సున్నిపెంట మరియు పరిసర మండలాల్లో వైద్యుల కొరత కారణంగా ప్రజలకు సరైన సేవలు అందడంలో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు. బేతంచర్ల మండలంలో సరిపడా మరుగుదొడ్లు లేకపోవడం వల్ల ప్రజల నుండి మిశ్రమ స్పందన వస్తోందని పేర్కొంటూ, తగిన మౌలిక వసతులు కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్యాస్ సరఫరాలో అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు పౌర సరఫరాల విభాగానికి సంబంధించి బనగానపల్లె మరియు నంద్యాల పట్టణాల్లో గ్యాస్ సిలిండర్ల డెలివరీ సమయంలో నగదు వసూళ్లు జరగకుండా పర్యవేక్షణ పెంచాలని, అక్రమంగా డబ్బులు వసూలు చేసే డెలివరీ సిబ్బందిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖలో కార్యాలయాల్లో తెలుగులో బోర్డులు ఏర్పాటు చేయాలని, సేవలు పొందేందుకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే ఔకు మరియు నందికొట్కూరు మండలాల్లో ప్రజా సంతృప్తి తక్కువగా ఉన్నందున ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు…
ప్రాజెక్ట్ జలధారా కింద వాగులు, చెరువులను పునరుద్ధరించండి:
జిల్లాలో భూగర్భ జలాలపై అధిక ఆధారపడటం వల్ల నీటి మట్టాలు పడిపోతున్నాయని, ఈ సమస్యకు పరిష్కారంగా “ప్రాజెక్ట్ జలధారా” కింద వాగుల పునరుద్ధరణ, చెరువుల అభివృద్ధి, చెక్‌డ్యామ్‌లు, రీచార్జ్ నిర్మాణాల ద్వారా నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచే చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జలవనరులు, భూగర్భజల, డ్వామా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిఐఎస్ సాంకేతికతతో నీటి అధిక, కొరత ప్రాంతాలను గుర్తించి అనుసంధానం చేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ అమలు చేసి, నీటి మట్టాలు పెరగడం, బోర్లు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
