మహిళా సాధికారతకు ‘శిల్పా’ భరోసా

217 మంది మహిళలకు 35 లక్షల 51 వేల రూపాయల రుణాల పంపిణీ – నాగిని రవిసింగారెడ్డి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 31 :

నంద్యాలలో మహిళా శక్తికి ఆర్థిక చేయూతనిస్తోంది శిల్పా మహిళా సహకార్ బ్యాంక్. పేదింటి మహిళలు స్వయం ఉపాధిలో రాణించి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో ఈ బ్యాంక్ అడుగులు వేస్తోంది. తాజాగా ఆర్థిక సంవత్సర ముగింపు సందర్భంగా 217 మంది మహిళలకు 35 లక్షల 51 వేల రూపాయల రుణాలను బ్యాంక్ చైర్‌పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పంపిణీ చేశారు.  మహిళా స్వయం శక్తికి నంద్యాల శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చిరునామాగా మారుతోంది. పేద మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే లక్ష్యంగా ఈ బ్యాంక్ గత 13 ఏళ్లుగా నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. ఆర్థిక సంవత్సర ముగింపు వేళ, బ్యాంక్ చైర్‌పర్సన్ నాగిని రవిసింగారెడ్డి చేతుల మీదుగా భారీగా రుణాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ కేవలం మహిళల కోసమే ఈ బ్యాంక్ నడుస్తోందని తెలిపారు. వేలాది మంది మహిళలు ఈ రుణాలతో స్వయం ఉపాధి పొంది, తమ కుటుంబాలకు అండగా నిలవడం గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెల నుండి 5 వేల నుండి 25 వేల వరకు రుణ పరిమితిని పెంచినట్లు ప్రకటించారు, అలాగే భవిష్యత్తులో లక్ష రూపాయల వరకు పెంచేందుకు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.”మహిళలు ఒక ప్రణాళికాబద్ధంగా పొదుపు చేసుకోవాలని, ఉన్న వనరులతోనే ప్రగతి సాధించాలన్నారు. పేదింటి మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలనేదే మా ఆశయం అని అందుకే అతి తక్కువ వడ్డీకే ఈ రుణాలను అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, లక్ష్మీనారాయణతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా ఖాతాదారులు పాల్గొన్నారు. రుణాల అందుకున్న మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ బ్యాంక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to Top