

నంద్యాల జిల్లా / డిసెంబర్ 30 – 2025 / సత్యం వార్త ప్రతినిధి :
జిల్లాలోని చెంచు గిరిజనులకు మెరుగైన, స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గిరిజన ఉత్పత్తులపై శిక్షణ మరియు జీవనోపాధి అవకాశాలపై సమావేశం నిర్వహించారు. డీఎఫ్ఓ విఘ్నేష్ అపోవా, డీఆర్ఓ రామునాయక్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని 48 చెంచుగూడెంలలో సుమారు 9 వేల మంది గిరిజనులు నివసిస్తున్నారని, వీరిలో ఎక్కువ మంది అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. తేనె, ఉసిరి (ఆమ్ల), ఇతర అటవీ ఉత్పత్తుల సేకరణతో పాటు, జ్యూట్ బ్యాగుల తయారీ, గుడ్డ సంచులు, పేపర్ కప్పులు, పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం వంటి నైపుణ్యాధారిత కార్యకలాపాల ద్వారా వారికి మెరుగైన ఆదాయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నైపుణ్యాభివృద్ధి ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారించి సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నాటు సారా కాయడం, సేవించడం వంటి దురలవాట్లకు స్వస్తి చెప్పి, నైపుణ్యాభివృద్ధి వైపు గిరిజనులను ఆకర్షించి ప్రత్యామ్నాయ జీవనోపాధులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. NSTR ద్వారా ఇప్పటికే పుట్టగొడుగుల సాగు, జ్యూట్/గుడ్డ సంచుల తయారీ, తేనెటీగల పెంపకం వంటి కార్యక్రమాలు ప్రారంభించామని, వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. దీర్ఘకాలిక జీవనోపాధి దిశగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జ్యూట్ బ్యాగులు, జాట్రోఫా ఉత్పత్తులు, పేపర్ కప్పుల తయారీ వంటి కార్యకలాపాలను శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాలతో అనుసంధానం చేయాలని ఆదేశించారు.
డిఆర్డిఏ వద్ద మార్కెటింగ్ కోసం ఆన్లైన్ ప్లాట్ఫారం అందుబాటులో ఉందని, ఐటీడీఏ, డిఆర్డిఎ ద్వారా ఆర్ఏఎస్ సభ్యులను గుర్తించి శిక్షణ ఇచ్చామని, ముఖ్యంగా తేనెటీగల పెంపకానికి శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని క్షేత్రాలు, అన్ని ఆలయాలలో, జాతర రోజుల్లో స్థానిక గిరిజన ఉత్పత్తుల విక్రయానికి స్టాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఉత్పత్తి–నైపుణ్యం–మార్కెటింగ్ మూడింటినీ అనుసంధానం చేసి సమగ్రంగా పని చేయాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. నంద్యాలలో 25 లక్షల వ్యయంతో బ్యాంకు సహకారంతో యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
