నంద్యాలలో హజ్ యాత్రికుల రెండో విడత శిక్షణ తరగతులు ప్రారంభం-  ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్

-యాత్రికులకు దిశానిర్దేశం చేసిన ముఫ్తీ షాజహాన్, డాక్టర్ ఎస్. ఇంతియాజ్ అహ్మద్*

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 28 :
నంద్యాల పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు 2026-2027 సంవత్సరానికి గాను హజ్ యాత్రకు ఎంపికైన భక్తుల కోసం రెండవ విడత శిక్షణ తరగతులను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి శిక్షణను ప్రారంభించారు.
శిక్షణ తరగతుల్లో భాగంగా ముఫ్తీ షాజహాన్ హజ్ యాత్రికులకు వస్త్రధారణ (ఇహ్రామ్), పాటించాల్సిన నియమ నిబంధనలు మరియు యాత్రలో అనుసరించాల్సిన పద్ధతులపై విపులంగా వివరించారు. భక్తులకు అర్థమయ్యే రీతిలో ప్రత్యక్షంగా చేసి చూపిస్తూ అద్భుతంగా బోధించారు.

ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ హజ్ యాత్ర అనేది ప్రతి ముస్లిం జీవితంలో ఒక అత్యున్నతమైన మరియు పవిత్రమైన ఘట్టమని తెలిపారు . అల్లాహ్ పిలుపు మేరకు హజ్ యాత్రకు ఎంపికైన నంద్యాల నియోజకవర్గ భక్తులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. హజ్ యాత్రలో పాటించాల్సిన నియమ నిబంధనలు క్లిష్టంగా ఉంటాయని, అందుకే ఇక్కడ ఇచ్చే శిక్షణ తరగతులను ప్రతి యాత్రికుడు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని సూచించారు. సరైన అవగాహన ఉంటేనే అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రార్థనలు పూర్తి చేసుకోగలరని తెలిపారు. యాత్ర సమయంలో క్రమశిక్షణతో ఉండి, మన దేశ గౌరవాన్ని కాపాడాలని కోరారు. పవిత్ర మక్కా, మదీనా సందర్శన సమయంలో దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రత్యేక ప్రార్థనలు చేయాలని యాత్రికులను కోరారు. హజ్ యాత్రికులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం మరియు పార్టీ పరంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

నేషనల్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్. ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ హజ్ యాత్రికుల సందేహాలకు తగిన సమాధానాలు ఇచ్చారు. విమానం ఎక్కినప్పటి నుండి యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వచ్చే వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల (ఇరాన్-ఇజ్రాయిల్-అమెరికా ఉద్రిక్తతలు) నేపథ్యంలో, అల్లాహ్ కరుణాకటాక్షాలతో యాత్రికులందరూ సురక్షితంగా హజ్ యాత్ర పూర్తి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ విద్యాసంస్థల పరిపాలన అధికారి రఫీ అహ్మద్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ అహ్మద్, అబ్దుల్ హాజీ మౌలానా, ముల్లా మహబూబ్ బాషా, రషీద్, హజ్ కమిటీ సభ్యులు, ఆర్కే ఫంక్షన్ హాల్ యాజమాన్యం మరియు స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.

Scroll to Top