ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక కృషితో కోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో.. ” 21 కొత్త మరియు అదనపు కోర్టులు”ఏర్పాటు కళకళ
  • న్యాయ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక కృషితో
  • కర్నూలు, నంద్యాల లో జిల్లా జడ్జి క్యాడర్ కోర్టులు
  • ఆదోని, ఎమ్మిగనూరులో సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్ కోర్టులు
  • శ్రీశైలంలో కొత్త జూనియర్ సివిల్ జడ్జి  కం జ్యూడిషియల్ ఫస్ట్  క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు
  • మరో 16 జూనియర్ సివిల్ జడ్జి కం జ్యూడిషియల్ ఫస్ట్  క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులు కూడా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 27 :

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో  కొత్త మరియు అదనపు కోర్టుల ఏర్పాటుకు  మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర పడిన నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏకంగా 21 కొత్త  మరియు అదనపు కోర్టులు ఏర్పాటు కానున్నాయి.ఉమ్మడి జిల్లాలో  తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా, ప్రస్తుతం నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో  న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఎన్ఎండి ఫరూక్  స్థానిక జిల్లాల్లో కొత్త కోర్టు ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా  భారీ సంఖ్యలో కొత్త కోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో న్యాయవాద వర్గాల్లో  హర్షాతిరేఖాలు వ్యక్తం అవుతున్నాయి…

పెండింగ్ కేసుల పరిష్కారం కోసం:

రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో  పెండింగ్ కేసుల సంఖ్య రోజు రోజుకు  పెరుగుతున్న నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని , వాటి పరిష్కారం కోసం, సత్వర న్యాయం కోసం  కొత్త కోర్టులు మరియు అదనపు కోర్టు లను ఏర్పాటు చేసేందుకు న్యాయశాఖ ప్రత్యేక చర్యలకు  ఉపక్రమించింది. ఇందులో భాగంగా  పెండింగ్ కేసుల సంఖ్య ఆధారంగా 2026-2027 ఆర్థిక సంవత్సరంలో  హైకోర్టు రిజిస్టార్( పరిపాలన విభాగం) ప్రతిపాదించిన 96  కొత్త మరియు అదనపు కోర్టులు ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గ సమావేశం  ఆమోదముద్ర వేసింది. కొత్త మరియు అదనపు కోర్టు ల్లో విధి నిర్వహణ కోసం 1730 పోస్టులు సృష్టించుటకు  కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది…

ఉమ్మడి జిల్లాలో 21 కోర్టుల ఏర్పాటు:

ఉమ్మడి కర్నూలు జిల్లా లోని  వివిధ నియోజకవర్గాల పరిధిలో 21 కొత్త మరియు అదనపు కోర్టు లు ఏర్పాటు కానున్నాయి. ఇందులో రెండు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులు, రెండు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు,17  జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 12 జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులలో భాగంగా ఉమ్మడి జిల్లాలో కర్నూలులో 8వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు, నంద్యాలలో 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన 25 సీనియర్ సివిల్ జడ్జి కోర్టులలో భాగంగా, ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదోనిలో ఒకటవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఎమ్మిగనూరులో  సీనియర్ సివిల్ జడ్జి కోర్టు  ఏర్పాటు చేయనున్నారు. జూనియర్ సివిల్ జడ్జి కం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుల ఏర్పాటు లో భాగంగా  రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 59 కోర్టుల్లో, ఉమ్మడి కర్నూలు జిల్లా కు 17 కోర్టులు మంజూరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో ఆదోనిలో మూడవ అదనపు సివిల్ జడ్జి కం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్  కోర్టు, ఆళ్లగడ్డలో ఒకటవ, ఆలూరు లో ఒకటవ, ఆత్మకూరులో ఒకటవ, బనగానపల్లెలో ఒకటవ, డోన్ లో  రెండవ, కర్నూలులో 5,6,7,8 వ అదనపు కోర్టులు, నందికొట్కూరులో ఒకటవ, నంద్యాలలో  2,3,4 అదనపు సివిల్ జడ్జి కోర్టులు, పత్తికొండలో ఒకటవ, ఎమ్మిగనూరులో ఒకటవ అదనపు సివిల్ జడ్జి కోర్టులు ఏర్పాటు కానున్నాయి. కాగా శ్రీశైలంలో కొత్తగా జూనియర్ సివిల్ జడ్జి కోర్టు  ఏర్పాటు చేస్తున్నారు…

పెండింగ్ కేసుల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు – రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్:

భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రకారం ఏ కేసు కూడా ఐదు సంవత్సరాలకు మించి పెండింగ్ లో ఉండరాదు.రాష్ట్రంలో పెండింగ్ కేసుల సంఖ్య 01-01-2019 నాటికి 5,38,020 ఉండగా, ఈ సంఖ్య 01-01-2025 నాటికి 8,93,993 కు చేరింది. కానీ కోర్టుల సంఖ్య మాత్రం ఈ కాలంలో 636 నుండి 660 కి మాత్రమే పెరిగింది.దీంతో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది.ఆర్థిక శాఖ 2026-27 కు గాను 100 కోర్టులు ఏర్పాటు చేయుటకు సమ్మతి తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జ్యుడీషియల్ జిల్లాలతో పాటు,రాబోయే కొత్త జ్యుడీషియల్ జిల్లాలలో 172 క్రొత్త మరియు అదనపు కోర్టులు ఏర్పాటు చేసేందుకు హైకోర్టు రిజిష్ట్రార్ (పరిపాలన) వారు ప్రతిపాదన పంపించారు.  ఇందులో 96 కోర్టుల ఏర్పాటుకు  మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు  21 కొత్త కోర్టులు  మంజూరు కావడంతో  పెండింగ్ కేసుల పరిష్కారంతోపాటు, సత్వర న్యాయ సేవలు  సులభతరం గా అందనున్నాయి.రాష్ట్రంలో 96 కోర్టులు, 1730 పోస్టులు మంజూరు  చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రివర్గ సహచరులకు,హై కోర్టుకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to Top