పథకాల అమలులో వేగం పెంచండి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 23 :

జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సేవల మెరుగుదల, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ అనంతరం పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నందున, మున్సిపల్ కమిషనర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తిరుపతి, నాయుడుపేట ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.  కార్యాలయాల్లో ఫైళ్ల నిర్వహణ, వాట్సాప్ సేవలు, KPI డేటా ఎంట్రీలను మెరుగుపరచాలని, సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల నుంచి ప్రభుత్వ సేవలపై ప్రతికూల స్పందన వస్తోందని, దీనిని సరిచేసేందుకు అన్ని శాఖలు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్లు, ఆర్.ఓ.ఆర్ సేవలు, రోడ్ల మరమ్మతులు, రవాణా శాఖ సేవలు, గురుకుల పాఠశాలల పనితీరు మెరుగుపరచాలని ఆదేశించారు. వచ్చే గురువారం నాటికి 18 లక్షల డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జిల్లా అధికారులు సమానంగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి శాఖలో ప్రజా సంతృప్తి స్థాయి కనీసం 75 శాతం పైగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పాఠశాలల్లో పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు, గాలి వెలుతురు సమృద్ధిగా ఉండేలా పర్యవేక్షించాలని తెలిపారు. విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని సూచించారు. ప్రభుత్వ సేవలకు సంబంధించిన వాట్సాప్ నంబర్లపై విస్తృత ప్రచారం చేపట్టి, ప్రతి కార్యాలయంలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ప్రజలు తమ సమస్యలను నేరుగా కలెక్టరేట్‌కు తీసుకురాకుండా, ఆన్‌లైన్ లేదా 1100 నంబర్ ద్వారా పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా వడగాల్పుల నివారణ చర్యలు చేపట్టి, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద గ్రీన్ షేడ్ నెట్స్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లను సూచించారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో పెండింగ్‌లో ఉన్న అభ్యాసకుల ఫలితాలను తక్షణమే అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 3,000 ఖాతాల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను గుర్తించి అభివృద్ధి పనులకు వినియోగించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు కేవలం 79 ఖాతాల నుండి రూ.48.72 లక్షలు మాత్రమే జమ అయినందున, మిగిలిన ఖాతాల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణాన్ని అభినందించిన కలెక్టర్, నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. సరైన క్యూరింగ్ లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆధునిక సాంకేతికతల వినియోగంతో రోడ్ల జీవితకాలాన్ని పెంచాలని సూచించారు. జిల్లాలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Scroll to Top