
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 20 :
నంద్యాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పొదుపు మహిళలకు ఉపాధి కల్పించేందుకు భారీ ఖర్చుతో తయారు చేసిన ఎగ్ కార్ట్స్ ప్రస్తుతం నిరుపయోగంగా మున్సిపల్ ఆవరణలో నిల్వ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మెప్మా జిల్లా కార్యాలయం వద్ద పలువురు ఎగ్ కార్ట్స్ ఎండకు ఎండుతూ, వాడుకలోకి రాకుండా ఉండటం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్ట్స్ను సరఫరా చేసినప్పటికీ, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి ఉపయోగంలోకి రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. లక్షల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేసి తయారు చేసిన ఈ కార్ట్స్ను సకాలంలో పంపిణీ చేయకపోవడం పై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నిల్వలో ఉన్న ఎగ్ కార్ట్స్ను వెంటనే అర్హులైన పొదుపు మహిళలకు పంపిణీ చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇవి పాడై పూర్తిగా వృథా అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
