రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాలలో ‘రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం’ కరపత్రాల విడుదల

అన్నదాత సుఖీభవ – పి.ఎం. కిసాన్ ద్వారా రైతులకు ఏడాదికి రూ. 20,000 ఆర్థిక సాయం

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఐదు అంచెల వ్యూహం

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 18 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. బుధవారం నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ‘రైతన్న సేవలో… మన మంచి ప్రభుత్వం’ మరియు ‘రైతన్న! మీ కోసం’ పేరుతో రూపొందించిన ప్రత్యేక కరపత్రాలను స్థానిక రైతులతో కలిసి ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని కేవలం జీవనాధారంగానే కాకుండా, గౌరవప్రదమైన లాభసాటి రంగంగా మార్చడానికి కట్టుబడి ఉందన్నారు. ప్రతి రైతు కుటుంబానికి ‘అన్నదాత సుఖీభవ – పి.ఎం. కిసాన్’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 14,000, కేంద్రం రూ. 6,000 కలిపి ఏటా రూ. 20,000 నేరుగా ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. మార్చి 13, 2026న మూడవ విడత నిధులు కూడా విడుదలయ్యాయని గుర్తుచేశారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్ (ఎఐ మరియు డ్రోన్లు), ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు అనే ఐదు సూత్రాలతో రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

రాయలసీమను ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, బిందు, తుంపర సేద్యానికి ఎస్సీ, ఎస్టీ రైతులకు 100%, ఇతరులకు 90% వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు . సాగులో ఏఐ , శాటిలైట్ సర్వేలు, డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని, దీనికోసం ‘ఫార్మర్ యాప్’ (APAIMS 2.0) అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఉల్లి, కోకో, ఆయిల్ పామ్ రైతులకు అదనపు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు, నల్లబరి పొగాకు రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా మద్దతు ధర కల్పించి ఆదుకున్నామని మంత్రి ఫరూక్ తెలిపారు . రైతులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించే వరకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు .

Scroll to Top