
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 16 :
రైతులకు అవసరమైన సహాయక సహకారాలను అందించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసే దిశగా “రైతన్న – మీకోసం” కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం “రైతన్న – మీకోసం” కార్యక్రమంపై వ్యవసాయ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా రైతులకు అవసరమైన సేవలు, సాంకేతిక సలహాలు అందించడంతో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 16 నుంచి 18 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అవసరమైతే మార్చి 23 నుంచి 25 వరకు మరో విడతగా కూడా కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చోట సచివాలయ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రతి రైతు మొబైల్ ఫోన్లో ఫార్మర్ యాప్ ఇన్స్టాల్ చేయించడంతో పాటు రైతులకు ఫార్మర్ ఐడీ రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ యాప్ ద్వారా రైతుల పంట వివరాలు, భూమి విస్తీర్ణం, సాగు చేస్తున్న పంటలు, పంటలకు తలెత్తే చీడపీడల వివరాలు వంటి సమాచారం సమగ్రంగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంక, డీఆర్ఓ రాము నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
