రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం – మంత్రి ఎన్ఎండి ఫరూక్

  • బిల్లాపురం గ్రామంలో ఘనంగా ‘అన్నదాత సుఖీభవ – పి.ఎం కిసాన్’ నిధుల పంపిణీ కార్యక్రమం
  • ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న మంత్రి ఫరూక్ , జిల్లా కలెక్టర్ రాజకుమారి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 13 :

నంద్యాల మండలం బిల్లాపురం గ్రామంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘అన్నదాత సుఖీభవ – పి.ఎం కిసాన్’ పథకం మూడవ విడత నిధుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజాకుమారి ముఖ్య అతిథిలుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీ మేరకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పి.ఎం కిసాన్ నిధులకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను జోడించి రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అవినీతికి తావులేకుండా పారదర్శక పద్ధతిలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే ఈ నగదు జమ అవుతుందని తెలిపారు. వ్యవసాయ పనులు మొదలయ్యే సమయానికి ఈ నిధులు అందడం వల్ల రైతులు అప్పుల బారిన పడకుండా తమ అవసరాలను తీర్చుకోగలుగుతారని అన్నారు. సాగునీరు, ఎరువులు, విత్తనాల సరఫరాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని, నంద్యాల జిల్లాను వ్యవసాయ రంగంలో మేటిగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలో ఇప్పటివరకు ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం ద్వారా సుమారు రూ.400 కోట్ల ఆర్థిక సహాయం రైతులకు అందిందన్నారు. అందులో ఒక్క నంద్యాల నియోజకవర్గానికే సుమారు రూ.25 కోట్ల నిధులు లభించాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని రైతులు సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా ఎస్‌సీ/ఎస్‌టీలకు 100 శాతం సబ్సిడీ, ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన చిన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ లభిస్తుందని కలెక్టర్ వివరించారు. సాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. రైతు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ మరియు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం కిసాన్’ పథకాలు వ్యవసాయాన్ని పండుగలా మార్చుతున్నాయని తెలిపారు.

నంద్యాల జిల్లా జీడీపీ (GDP)లో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తోందని, జిల్లా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి రైతుల కృషి ఎంతో ముఖ్యమని ఆమె అన్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సమర్థంగా వినియోగించుకుంటూ సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటల సాగు వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఆధునిక వ్యవసాయ సాంకేతికతను అనుసరించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకొని జిల్లాను వ్యవసాయ రంగంలో ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బిల్లాపురం గ్రామ టీడీపీ ఇంచార్జి చిలకల చిన్నయ్య, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ సురేష్ కుమార్, గౌడ్ కన్నాయోహన్,రామకృష్ణారెడ్డి, రంగ ప్రసాద్, పుల్లయ్య,  మునగాల విశ్వనాథ్ రెడ్డి, తులసీశ్వర్ రెడ్డి, బుగ్గ రాముడు, ఇమ్మడి శ్రీనివాసులు, బాలరాజు, బోప్ప బాలుడు, రాజగోపాల్ స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు,  వ్యవసాయ శాఖ అధికారులు మరియు బిల్లాపురం గ్రామ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top