
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 11 :
అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమానికి సంబంధించి వెల్ఫేర్ సెక్రటరీలతో పురపాలక కమిషనర్ బి. శేషన్న బుధవారం తన ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్షలకు నమోదు అయిన లర్నర్లు 100 శాతం హాజరు కావడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వెల్ఫేర్ సెక్రటరీలకు సూచించారు.
ప్రతి లర్నర్కు ముందుగానే సమాచారం అందించి పరీక్షలపై అవగాహన కల్పించాలని తెలిపారు. పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎవరూ పరీక్షకు దూరం కాకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు.
అక్షరాస్యత పెంపు ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందులో భాగంగా అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కమిషనర్ పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలలో అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని, లర్నర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష రాయగల విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో మెప్మా సీఎంఎం భాస్కర్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులు, వెల్ఫేర్ సెక్రటరీలు పాల్గొన్నారు.
