
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 08 :
సిరివెళ్ల మండల పరిధిలోని నల్లమల అడవి సమీప గ్రామం మహదేవపురంలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. గ్రామంలో అధికార పార్టీ నాయకులపై ప్రజల్లో అసంతృప్తి పెరగడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. వైసీపీ యువనేత కంపరాజు రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కార్యకర్తలు కలిపి సుమారు 200 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కర్నూలు–నంద్యాల ఉమ్మడి జిల్లాల వైసీపీ పరిశీలకుడు గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి (నాని) సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యం ఉంటుందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని నాయకులు తెలిపారు. మహదేవపురం గ్రామం నుంచి సుమారు 30 వాహనాల్లో నాయకులు, కార్యకర్తలు ఆళ్లగడ్డకు చేరుకుని పార్టీలో చేరారు. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ ఇందూరి ప్రతాప్ రెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ సలాం, ఎంపీపీ నాయక్ మహమ్మద్ వసీం, మందాల శివారెడ్డి, జింకల నాగన్న, గుండంపాడు ప్రతాప్ రెడ్డి, కొట్టే జయలక్ష్మమ్మ, పిక్కిలి నరహరి, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
