అంకిరెడ్డి చెరువులో మట్టి తవ్వకాలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 07 :
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి సమీపంలోని అంకిరెడ్డి చెరువులో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. రాత్రి వేళల్లో చెరువులో నుంచి మట్టిని తీసి నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల చెరువులో నీటి మట్టం తగ్గడంతో అక్రమార్కులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ చెరువు ప్రాంతంలో భారీగా తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఇటీవల కూడా ఇలాంటి తవ్వకాలు జరగడంతో స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ మళ్లీ అదే పరిస్థితి నెలకొనడం పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో ఎర్రమట్టి తరలింపుతో చెరువు క్రమంగా దెబ్బతింటుందని, భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్లు, లారీలు తీసుకొచ్చి మట్టిని తరలిస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో చెరువు పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో భారీ వాహనాల రాకపోకలు పెరిగాయని తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ, గనుల శాఖ అధికారులు వెంటనే స్పందించి చెరువులో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. చెరువు ఉనికిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Scroll to Top