ఈ నెల 29న కలెక్టరేట్ ఆవరణలో పెద్దఎత్తున రెవెన్యూ క్లినిక్స్ నిర్వహణ – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

  • రెవెన్యూ సమస్యలకు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా పరిష్కారం
  • ఈ నెల 29న కలెక్టరేట్ ఆవరణలో పెద్దఎత్తున రెవెన్యూ క్లినిక్స్ నిర్వహణ – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు సమగ్రంగా పరిష్కారం చూపేందుకు రెవెన్యూ క్లినిక్స్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో రెవెన్యూ క్లినిక్స్ నిర్వహణ, జనవరి 2 నుండి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రీసర్వే ఫేజ్–4 అమలుపై జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశాలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ శ్రీ కొల్లాబత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ రాము నాయక్, నంద్యాల, డోన్, ఆత్మకూరు డివిజన్ల ఆర్డీఓలు, తహశీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఈ నెల 29వ తేదీన కలెక్టరేట్ ఆవరణలో పెద్దఎత్తున రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని ఆదేశించారు. వివిధ సమస్యలతో క్లినిక్స్‌కు వచ్చే అర్జీదారులు ఏ కౌంటర్‌ను సంప్రదించాలి, ఏ రకమైన దరఖాస్తులు సమర్పించాలి అనే అంశాలపై ముందుగానే వారికి స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా రెవెన్యూ క్లినిక్స్‌కు హాజరయ్యే అధికారులు సంబంధిత అన్ని రికార్డులు, దస్త్రాలతో సిద్ధంగా ఉండాలని, అర్జీదారులకు తక్షణమే సరైన మార్గనిర్దేశం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టాదారు పాస్ పుస్తకాలను జనవరి 2వ తేదీ నుండి పంపిణీ చేయాలని, ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అలాగే రీసర్వే ఫేజ్–4 ప్రక్రియను సక్రమంగా, సమయపాలనతో నిర్వహించేలా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

Scroll to Top