పిజిఆర్ఎస్ ద్వారా 262 దరఖాస్తుల స్వీకరణ
రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 130 దరఖాస్తుల స్వీకరణ
- జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా





సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 02
ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో, వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డిఆర్ఓ రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి దరఖాస్తును సమయానుకూలంగా పరిశీలించి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి పరిశీలించాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం 71 అర్జీలు ఇంకా ఓపెన్ చేయలేదని తెలిపారు. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారులకు అందజేసే ఎండార్స్మెంట్లు స్పష్టంగా, పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. రీ-ఓపెన్ అయిన అర్జీలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, అవి మళ్లీ పెండింగ్లో పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆడిట్ కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రజా ప్రతినిధుల ద్వారా వచ్చే వినతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, వాటిని ప్రాధాన్యంతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 130 అర్జీల స్వీకరణ:
భూసంబంధిత సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తం 130 దరఖాస్తులు స్వీకరించగా, వాటిలో రెవెన్యూ, గ్రామ/వార్డు సచివాలయ సేవలకు సంబంధించినవి 4, అడంగల్ సవరణలకు సంబంధించినవి 22, చుక్కల భూముల క్రమబద్ధీకరణ, 22-ఎ భూములకు సంబంధించినవి 19, అసైన్డ్ భూములు, భూఆక్రమణలకు సంబంధించినవి 18, రెవెన్యూ కోర్టు విచారణలు, ఆర్ఓఆర్కు సంబంధించినవి 26, సర్వే, రీ-సర్వేలకు సంబంధించినవి 33, దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించినవి 8 గా ఉన్నాయని కలెక్టర్ వివరించారు.
పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన కొన్ని ప్రజా సమస్యలు:
1)పాణ్యం మండలం నెరవాడ గ్రామానికి చెందిన ఎన్. లక్ష్మిరెడ్డి సర్వే నెం. 462/2లో తనకు కొంత భూమి ఉందని, అయితే ఆ భూమి ఆన్లైన్లో వక్ఫ్ బోర్డు భూమిగా నమోదైందని తెలిపారు. దానిని సవరించి తన భూమిని ఆన్లైన్ రికార్డుల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు దరఖాస్తు సమర్పించారు.
2)బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన టి. లక్ష్మిదేవి తన భర్త మృతి చెందినందున, తనకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద వితంతువు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
3)డోన్ మండలం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన ఎస్. మహబూబ్ బాషా సర్వే నెం. 473-బి1ఎ2, 473-సి3ఎ2లో 1 ఎకరా 57 సెంట్ల భూమి కలిగి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు రైతు భరోసా మరియు పంట నష్టపరిహారం అందలేదని పేర్కొంటూ జిల్లా కలెక్టర్కు దరఖాస్తు సమర్పించారు.
