ప్రజా ఫిర్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండండి

రీఓపెన్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించండి

పిజిఆర్ఎస్‌లో 311, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 176 అర్జీల స్వీకరణ

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 23 :
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో తమ సమస్యలను సమర్పిస్తారని, వాటి పరిష్కారంలో నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదన్నారు. ప్రస్తుతం 53 దరఖాస్తులు ఇంకా ఓపెన్ చేయలేదని, వాటిని తక్షణమే పరిశీలించాలని సూచించారు. అర్జీదారుల అసంతృప్తి కారణంగా 283 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, అలాంటి అర్జీలపై సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి సంతృప్తికర పరిష్కారం అందించాలని ఆదేశించారు. ఇంకా 2,455 దరఖాస్తులు పరిష్కార దశలో ఉన్నాయని, నిర్ణీత గడువులోగా వాటిని పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధుల ద్వారా వచ్చిన అర్జీలను కూడా అదే ప్రాధాన్యతతో పరిష్కరించడం అధికారుల బాధ్యత అని తెలిపారు.
పీజీఆర్ఎస్‌లో స్వీకరించిన ముఖ్య అర్జీలు:
●మిడ్తూరు మండలం మంచాలకట్ట గ్రామానికి చెందిన కె. రమణా రెడ్డి, సర్వే నం. 485లో ఉన్న తన 7 ఎకరాల భూమిలో 4 ఎకరాలపై విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడంతో తగిన నష్టపరిహారం అందలేదని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

●మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన సంగిరెడ్డి శివమ్మ, సర్వే నం. 119, 120లలో ఉన్న 2.50 ఎకరాల భూమికి భర్త మరణించిన నేపథ్యంలో తన పేరుపై పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని అభ్యర్థించారు.

●సిరివెళ్ల మండలం మహాదేవపురం గ్రామానికి చెందిన ముల్లా మహబూబ్ బీ, సర్వే నం. 526/2ఎలో ఆన్‌లైన్‌లో భూవిస్తీర్ణం తక్కువగా నమోదైన విషయాన్ని సరిదిద్దాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 311 మంది అర్జీదారులు తమ సమస్యలను నమోదు చేసుకున్నారు. స్వీకరించిన అర్జీలన్నింటినీ సంబంధిత శాఖలకు ఎండార్స్ చేస్తూ, నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 176 అర్జీలు:
భూ సంబంధిత సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. గ్రామస్థాయిలోనే సమస్యలను పరిశీలించి వేగంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తం 176 అర్జీలు స్వీకరించబడినట్లు వివరించారు. వాటిలో రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయ సేవలకు సంబంధించినవి – 5, అడంగల్ సవరణలు – 59, చుక్కల భూముల క్రమబద్ధీకరణ మరియు 22-ఎ భూములు – 13, అసైన్డ్ భూములు మరియు భూఆక్రమణలు – 33, రెవెన్యూ కోర్టు విచారణలు మరియు ఆర్‌ఓఆర్‌కు సంబంధించినవి – 26, సర్వే మరియు రీ-సర్వే అంశాలు – 38, దేవాదాయ మరియు వక్ఫ్ భూములు – 2 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.

Scroll to Top