ఏకీకృత కుటుంబ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 23 :
జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలులో అధికారులు మరింత బాధ్యతతో, వేగవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ (పన్నులు మరియు సేవల ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్) అప్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రతి సోమవారం ప్రత్యేకంగా ఈ అంశంపై సమీక్షిస్తానని అధికారులకు సూచించారు. డాక్యుమెంట్ సబ్మిషన్ లక్ష్యాన్ని 13 లక్షల నుండి 15 లక్షలకు పెంచినట్లు తెలిపారు. పెరిగిన లక్ష్యాన్ని సాధించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ప్రతి మండల స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఏకీకృత కుటుంబ సర్వే పూర్తి చేయడానికి ఈ నెల 28 చివరి తేదీగా నిర్ణయించబడిందని పెండింగ్ లో ఉన్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ఆదేశించారు. గడువు లోపు సర్వే పూర్తి చేసి వివరాలను సమగ్రంగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని సూచించారు. విద్యార్థులకు తాగునీరు, పారిశుధ్యం, బస్సు సౌకర్యాలు వంటి మౌలిక సదుపాయాలు సరైన రీతిలో కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను అనుమతించవద్దని స్పష్టంగా ఆదేశించారు. ఉద్యోగుల నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఐగోట్ కోర్సులను ఏర్పాటు చేసిందని….ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కనీసం 40 ఐగోట్ ఆన్‌లైన్ కోర్సులను పూర్తి చేసి సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖల ద్వారా అందుబాటులో ఉన్న వాట్సాప్ సేవలను ప్రజలకు విస్తృతంగా తెలియజేసి, ఎక్కువ మంది వినియోగించుకునేలా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి 3,330 ఖాతాలు ఈ-కెవైసి ప్రక్రియ చేయాల్సి ఉందని ఈ నెల 27వ తేదీలోగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలను సమయపాలనతో పూర్తి చేసి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
