శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమం  

మాతృభాషే మన అస్తిత్వం – అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంలో వక్తల ఉద్ఘాటన

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 21:
శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో,తెలుగు విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాతృభాష ప్రాధాన్యత, భాషా సంరక్షణ అవసరాన్ని విద్యార్థుల్లో నాటే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, కళాశాల ప్రాంగణం విద్యార్థులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాతృభాష మన ఆలోచనలకు మూలమని, భావవ్యక్తీకరణకు సహజమైన సాధనం మాతృభాషేనని అన్నారు. విద్య మాతృభాషలో అందితే విద్యార్థుల్లో అవగాహన పెరగడమే కాకుండా సృజనాత్మకత వికసిస్తుందని తెలిపారు. తెలుగు భాషకు ఉన్న గొప్ప చరిత్ర, సాహిత్య సంపదను యువత తెలుసుకొని గర్వించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. మహోన్నతమైన వ్యక్తుల జీవిత చరిత్రలు చదవాలని, గ్రంథ పఠన అలవాటు చేసుకోవాలని అన్నారు. నూతన విద్యా విధానం మాతృభాషలకు సాహిత్యానికి, కళలకు ప్రాంతీయ కళారూపాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.
ముఖ్య అతిథుల ప్రేరణాత్మక ఉపన్యాసాలు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల పట్టణ ప్రముఖ వైద్యులు, సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచీకరణ ప్రభావంతో అనేక భాషలు అంతరించిపోతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో మాతృభాషను కాపాడుకోవడం ప్రతి పౌరుని బాధ్యతగా మారిందన్నారు. భాష ఉన్నప్పుడే సంస్కృతి నిలుస్తుందని, సంస్కృతి ఉన్నప్పుడే సమాజం బలంగా ఉంటుందని వివరించారు. వేమన, సుమతి, కృష్ణ శతకాలు చదవాలని పద్యాలను కంఠస్థ పెట్టాలని తెలుగు భాష పైన సాహిత్యం పైన విద్యార్థులు అభిరుచి ఇష్టాన్ని ఏర్పరచుకోవాలని అన్నారు. తెలుగు భాష మాటకు పాటకు పద్యానికి శ్లోకానికి అనువైన భాష అని అన్నారు.
మరో ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది, సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీ యం శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ
 తెలుగు భాషకు అపారమైన సాహిత్య సంపద ఉందని, భావాలను హృదయానికి హత్తుకునేలా వ్యక్తపరచగల శక్తి మాతృభాషకే సాధ్యమని అన్నారు. విద్యార్థులు ఆంగ్ల భాషను నేర్చుకుంటూనే మాతృభాషను నిర్లక్ష్యం చేయకుండా రోజువారీ జీవితంలో తెలుగును వినియోగించాలని సూచించారు. పాఠశాలలు కళాశాలలో తెలుగు భాషకు ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కేబివి సుబ్బయ్య మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృభాషల ప్రాధాన్యాన్ని గురించి చెబుతూ విద్యార్థులు మాతృభాషలో ఉన్న సౌలభ్యాన్ని మాధుర్యాన్ని గుర్తించాలని అన్నారు. శ్రీమతి ఏఎస్ ప్రగతి మాట్లాడుతూ విద్యార్థులు మాతృభాషల ప్రాధాన్యాన్నీ గుర్తిస్తూ ఇంగ్లీష్ వంటి భాషలను నేర్చుకోవాలని, పట్టు సాధించాలని అన్నారు. మన సహజత్వానికి మాతృభాషలు దగ్గరగా ఉంటాయని సహజమైన భావాలను మాతృభాషలలోనే మనకు తెలియకుండా వ్యక్తం చేస్తామని అన్నారు. ఉపాధి కోసం ఇంగ్లీష్ వంటి భాషలను నేర్చుకున్న అమ్మ భాషను మరవకూడదని అన్నారు.
విద్యార్థుల్లో మాతృభాషపై అవగాహన అభిరుచి పెంచుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు మాతృభాష ప్రాధాన్యతపై జరిగిన ఉపన్యాసాలు, చర్చలు విద్యార్థుల్లో మంచి అవగాహనను కల్పించాయి. భాషా పరిరక్షణకు సంబంధించిన అంశాలు విద్యార్థులను ఆలోచింపజేశాయి.
విజయవంతంగా ముగిసిన కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం వారు ముఖ్య అతిథులను శాలువా పూలమాల మెమెంటోళ్ళతో సన్మానించారు.
కార్యక్రమం చివరలో నిర్వాహకులు ముఖ్య అతిథులకు, అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్ లలితా సరస్వతి శ్రీ మోహనరావు, సత్యనారాయణ, మస్తాన్, విద్యార్థులు పాల్గొన్నారు. 
జాతీయగీతంతో కార్యక్రమం ముగిసింది.

Scroll to Top