

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 19 :
జిల్లాలో నిర్దేశించిన గృహ నిర్మాణాలను ఉగాది నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి హౌసింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మున్సిపల్ కమిషనర్లు, డీఎల్‌డివోలు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉగాది నాటికి 10,178 గృహాలను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. లక్ష్య సాధనలో భాగంగా వారపు లక్ష్యాలను నిర్దేశించుకుని సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం 374 గృహాలు పూర్తయ్యాయని తెలిపారు. బేస్‌మెంట్, లెంటల్, రూఫ్ లెవెల్‌లలో ఉన్న గృహాలన్నింటినీ ఉగాది నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద మంజూరైన 2,348 గృహాలలో 584 గృహాలకు గ్రౌండింగ్ పూర్తయ్యిందని, మిగిలిన 1,630 గృహాలకు ఫిబ్రవరి నెలాఖరులోగా శాతం వంద గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. చెంచు కాలనీల్లో పియం జన్మన్ పథకం కింద మంజూరైన 556 గృహాలలో 302 గృహాలు గ్రౌండింగ్ అయ్యాయని, మిగిలిన 254 గృహాలకు కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరైన 26,609 యూనిట్లలో 12,616 పూర్తి కాగా, బేస్‌మెంట్ స్థాయిలో ఉన్న 3,409 యూనిట్లను వేగవంతం చేయాలని, ఇంకా ప్రారంభం కాని 8,679 యూనిట్లకు గ్రౌండింగ్ చేపట్టి మార్చి 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద మంజూరైన 12,715 గృహాలలో 8,112 పూర్తయ్యాయని, మిగిలిన 4,603 గృహాలకు సంబంధించిన ఖాతా వివరాలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పేదల గృహ నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి అధికారి బాధ్యతగా తీసుకుని సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
