మాతృ-శిశు మరణాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోండి – జిల్లా కలెక్టర్  రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 18 :

జిల్లాలో మాతృ మరియు శిశు మరణాలను గణనీయంగా తగ్గించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాతృ- శిశు మరణాల నివారణ కమిటీ సమావేశాన్ని  నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇటీవల టంగుటూరు, డబ్ల్యు.కొతపల్లి, యుపిహెచ్‌సి జగజ్జనని నగర్, యుపిహెచ్‌సి అహోబిలం రోడ్ (ఆళ్లగడ్డ), ఎన్.జి.ఓ కాలనీ ప్రాథమిక మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో నమోదైన ఐదు శిశు మరణాలపై కలెక్టర్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రతి కేసును విడివిడిగా పరిశీలించి, కారణాలను విశ్లేషించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా సూచించారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి ప్రమాద గర్భిణీలను ముందుగానే గుర్తించి, అవసరమైన పరీక్షలు, పోషకాహారం, వైద్య సేవలను సమయానికి అందించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. మాతృ-శిశు మరణాలు అత్యంత విషాదకరమైనవే కాకుండా వ్యవస్థలో ఉన్న లోపాలను స్పష్టంగా చూపిస్తున్నాయని, ఇకపై నిర్లక్ష్యం ఏ స్థాయిలోనూ సహించేది లేదన్నారు. ప్రతి గర్భిణీ, ప్రతి శిశువు భద్రత ప్రభుత్వానికి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం జరిగేలా సమగ్ర పర్యవేక్షణ చేయాలని సూచించారు. బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణలు మాతృ-శిశు మరణాలకు ప్రధాన కారణాలని పేర్కొంటూ, వాటిని పూర్తిగా అరికట్టేందుకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీలను తొలిదశలోనే నమోదు చేసి, హైరిస్క్ కేసులను గుర్తించి పైస్థాయికి నివేదించాలని కలెక్టర్ ఆదేశించారు.  పుట్టిన ప్రతి శిశువు ఆరోగ్యంగా ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. సేవలందించడంలో ఏ విధమైన నిర్లక్ష్యం జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు అని కలెక్టర్ స్పష్టం చేసారు. ఈ సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్వో డా. శారదాబాయి, ఎంసిహెచ్ నోడల్ అధికారి డా. ప్రసన్నలక్ష్మి, ప్రోగ్రాం అధికారి డా. ఎస్.ఎస్. శ్రీజ, నంద్యాల సర్వజన ఆసుపత్రి గైనకాలజీ విభాగం డా. పి. పద్మజ, శిశువిభాగం డా. రవీంద్రనాథ్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ లీలావతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top