నంద్యాలలో పారామిలిటరీ మాజీ సైనికుల ర్యాలీ




సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 14 :
పుల్వామా ఉగ్రదాడి జరిగి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా, దేశం కోసం ప్రాణాలర్పించిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాలను స్మరిస్తూ నంద్యాల జిల్లా సిఏపిఫ్ (పారామిలిటరీ) మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక పద్మావతి నగర్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని సంఘీభావం తెలిపారు. 2019 ఫిబ్రవరి 14 న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై జరిగిన ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్ లకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ దేశ రక్షణలో పారామిలిటరీ జవాన్ల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. పుల్వామా ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని, విచ్ఛిన్నకర శక్తులను అందరూ ఏకమై ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అమరవీరుల త్యాగం వృధా పోదని, వారి కుటుంబాలకు అండగా ఉండటం మన బాధ్యతని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఏపీఎఫ్ నంద్యాల అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ అఫీజుల్ల, ఫక్రుద్దీన్ , డియం హుస్సేన్, సోమశేఖర్ టీడీపీ నాయకులు తాటికొండ బుగ్గ రాముడు, బింగుమల్లె శ్యామ్ సుందర్ గుప్తా మరియు పారామిలిటరీ మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
