పన్నులతోనే పట్టణాభివృద్ధి..పన్నులు సకాలంలో చెల్లించాలి – మున్సిపల్ రెవెన్యూ అధికారి వెంకటరెడ్డి

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 13 :

నంద్యాల పట్టణ అభివృద్ధికి ప్రతి పౌరుడు పన్నులు సమయానికి చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, నీటి కుళాయి పన్నులు సకాలంలో చెల్లించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

పట్టణంలో మొత్తం 49.768 అసెస్మెంట్లు ఉండగా, వాటికి రూ.31 కోట్ల 48 లక్షల 26 వేల డిమాండ్ ఉందన్నారు. ఫిబ్రవరి 12వ తేదీ నాటికి రూ.17కోట్ల 11 లక్షల 54 వేలు వసూలు కాగా, ఇంకా రూ.14 కోట్ల 36 లక్షల 72 వేలు బకాయిలుగా ఉన్నాయని తెలిపారు.

నీటి పన్నుల విషయంలో పట్టణంలో 32,564 కనెక్షన్లు ఉండగా, రూ.8 కోట్ల 93 లక్షల 66 వేల డిమాండ్ ఉందన్నారు. ఇప్పటివరకు రూ.2 కోట్ల 77 లక్షల 88 వేలు వసూలు కాగా, ఇంకా రూ.6 కోట్ల 14లక్షల 79 వేలు బకాయిలుగా ఉన్నాయని వివరించారు. అలాగే పట్టణంలో 3094 ఖాళీ స్థలాలు ఉండగా, వాటికి రూ.1 కోటి 86 లక్షల 11 వేల డిమాండ్ ఉందని, ఇప్పటివరకు రూ.55 లక్షల 93 వేలు మాత్రమే వసూలైందని తెలిపారు. ఇంకా రూ.1 కోటి 30లక్షల 18 వేల వసూలు కావాల్సి ఉందన్నారు. ఇటీవల మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా విక్రమ్, శభరిష్ బాధ్యతలు స్వీకరించారని,  వారి కృషితో మరియు సచివాలయ సిబ్బంది తో పన్ను వసూలులో వేగం పెరిగిందని తెలిపారు. ప్రతిరోజూ రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పన్ను వసూళ్లు జరుగుతున్నాయని చెప్పారు. పట్టణాభివృద్ధికి పన్నులే కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పన్నులు చెల్లించాలని ఆర్ ఓ వెంకటరెడ్డి పునరుద్ఘాటించారు.

Scroll to Top