భక్తులతో కలిసి క్యూలైన్‌లో నిలబడి, సహపంక్తిగా భోజనం చేసిన జిల్లా కలెక్టర్

ఉచిత క్యూలైన్ ద్వారా వచ్చే భక్తులకు సమగ్ర సదుపాయాలు

సత్యం వార్త / (శ్రీశైలం) నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 13 :

శ్రీశైలం క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉచిత క్యూలైన్ ద్వారా వచ్చే భక్తులకు అన్ని విధాలా సమగ్ర సదుపాయాలు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. భక్తుల సౌకర్యం, భద్రత, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ఏర్పాట్లు పటిష్టంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం సాధారణ భక్తులతో కలిసి ఉచిత క్యూలైన్‌లో ప్రయాణించిన జిల్లా కలెక్టర్, శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం లో స్వామి, అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. క్యూలైన్‌లో భక్తులతో మమేకమై వారి అభిప్రాయాలు, సూచనలు స్వయంగా తెలుసుకున్నారు. దర్శన సమయం, క్యూలైన్ నిర్వహణ, తాగునీరు, వైద్య సదుపాయాలు, విశ్రాంతి ఏర్పాట్లపై భక్తులను అడిగి వివరాలు సేకరించారు.

దర్శనానంతరం స్వామివారి ఉచిత లడ్డు ప్రసాదాన్ని భక్తులకు స్వయంగా పంపిణీ చేశారు. లడ్డు కౌంటర్ల వద్ద టోకెన్ విధానం, క్రమబద్ధమైన సరఫరా ప్రక్రియ, నిల్వలు, భక్తుల రద్దీ నియంత్రణ తదితర అంశాలను పరిశీలించారు. ప్రసాద పంపిణీ వేగవంతంగా, పారదర్శకంగా జరుగుతున్నదీ నిర్ధారించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదనపు సిబ్బంది నియామకం, మార్గదర్శక బోర్డులు వంటి ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా, క్యూలైన్ ద్వారా భక్తులతో కలిసి దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన సత్రానికి వెళ్లిన కలెక్టర్, సహపంక్తిగా కూర్చొని భోజనం చేశారు. భోజన నాణ్యత, వంటశాల పరిశుభ్రత, తాగునీటి సరఫరా, వడ్డింపు విధానం, కూర్చునే ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. భక్తులకు గౌరవప్రదంగా, వేగవంతంగా భోజనం అందేలా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు.

బ్రహ్మోత్సవాల దృష్ట్యా రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా పరిశుభ్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలు, తాగునీటి సరఫరా, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు చేయాలని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టామని, ప్రతి విభాగం నిరంతరం పర్యవేక్షణలో ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Scroll to Top