సుమారు 20 నిమిషాల్లో మల్లన్న దర్శనం పూర్తి
- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా





సత్యం వార్త / (శ్రీశైలం) నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 13 :
ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీశైలం దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఉచిత క్యూలైన్ ద్వారా సాధారణ భక్తులతో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ క్యూలైన్లలో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ఉచిత దర్శన క్యూలైన్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, శానిటేషన్ సదుపాయాలు, వైద్య సేవలు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లలో తాగునీటి సదుపాయం నిరంతరంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, పారిశుధ్య ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారికి కలుగుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకొని, అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రత్యేక దర్శనాల కంటే సాధారణ భక్తులకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించిన సమర్థవంతమైన ఏర్పాట్ల ఫలితంగా సుమారు 20 నిమిషాల్లోనే శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల దర్శనం పూర్తి చేయగలిగామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉచిత క్యూలైన్ ద్వారా భక్తులకు తక్షణ దర్శనం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు. మహాశివరాత్రి వేళల్లో భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, భక్తులు సంయమనం పాటిస్తూ, శివనామ స్మరణతో, దేవాలయ నియమ నిబంధనలు అనుసరిస్తూ దర్శనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
