
సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 12 :
శ్రీశైలంలో స్వామి అమ్మవార్ల దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. స్పర్శ దర్శనానికి ఆఖరి రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు క్షేత్రానికి తరలివస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ముఖ్యంగా తొక్కిసలాటలకు అవకాశం లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. దేవస్థానం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బుధవారం మొత్తం 63,596 మంది భక్తులు దర్శనం చేసుకోగా, అందులో 14,803 మంది శివస్వాములకు స్పర్శ దర్శనం కల్పించారు. అటవీ మార్గం ద్వారా 26 వేల మందికి పైగా భక్తులు వచ్చారని, వారికి అవసరమైన సౌకర్యాలు అందించినట్లు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు 30,149 మంది దర్శనం చేసుకోగా, 11,500 మంది శివస్వాములు స్పర్శ దర్శనం పొందారు. భక్తుల కోసం తాగునీరు, భోజన వసతులు, పార్కింగ్, తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మహాశివరాత్రి రోజున సుమారు లక్షన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు.
