
శ్రీశైల దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్లో టెలికాం సేవలపై సమీక్ష
భక్తులకు నిరంతర ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి – జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 12 :
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైల క్షేత్రానికి భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, కమ్యూనికేషన్ సేవలు అంతరాయం లేకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సెల్ ఫోన్ టవర్ సంస్థల ప్రతినిధులను సూచించారు. గురువారం శ్రీశైల దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్లో జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ గారితో కలిసి బిఎస్ఎన్ఎల్ అధికారులు, వివిధ సెల్ ఫోన్ టవర్ సంస్థల ప్రతినిధులు, ఫైబర్ నెట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే రెండు, మూడు రోజుల్లో సుమారు మూడు లక్షల మంది భక్తులు శ్రీశైలానికి రానున్న నేపథ్యంలో, ఫోన్ కాల్స్ మరియు ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని… భక్తులకు ఎటువంటి సిగ్నల్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు, క్యూలైన్లు, దేవస్థానం పరిసరాలు, ఆర్టీసీ బస్టాండ్, పార్కింగ్ ప్రదేశాలు, నడకదారి మార్గాలలో సిగ్నల్ ఫ్రీక్వెన్సీని పెంచి అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. తాత్కాలిక మొబైల్ టవర్లు (మొబైల్ బూస్టర్ యూనిట్లు) ఏర్పాటు చేయడం, ప్రస్తుత టవర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఫైబర్ నెట్ కనెక్షన్లను సమర్థవంతంగా నిర్వహించడం వంటి అంశాలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి కాల్ డ్రాప్స్, నెట్వర్క్ జామ్ సమస్యలు లేకుండా 24 గంటల మానిటరింగ్ వ్యవస్థను అమలు చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యం దృష్ట్యా సేవలలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించే విధంగా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని టెలికాం సంస్థల ప్రతినిధులకు కలెక్టర్ స్పష్టం చేసారు.
జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ మాట్లాడుతూ, అత్యవసర సేవలు, పోలీస్ కంట్రోల్ రూమ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యల సమన్వయం కోసం నిరంతర కమ్యూనికేషన్ అత్యంత కీలకమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో దేవస్థానం అధికారులు, టెలికాం విభాగ సిబ్బంది, ఫైబర్ నెట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
