
సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / ఫిబ్రవరి 12 :
నంద్యాల టౌన్లో వరుసగా మోటార్ సైకిళ్లు దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా పోలీసు అధికారి సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు, నంద్యాల ఉపవిభాగ పోలీసు అధికారి జావళి పర్యవేక్షణలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మరియు సీసీఎస్ సిబ్బంది సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు.
జనవరి 25న నంద్యాల బస్టాండ్ వద్ద పార్క్ చేసిన వాహనం దొంగిలించబడినట్లు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఫిబ్రవరి 5న చెరువు కట్ట వద్ద వాహన తనిఖీలో షేక్ మహమ్మద్ వలి అనే వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద నుండి ఒక స్కూటర్, మూడు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో తొమ్మిది కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసును వారం రోజుల్లో ఛేదించిన సిబ్బందిని జిల్లా పోలీసు అధికారి అభినందించారు.
ప్రజలు వాహనాలను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
