
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 11 :
సికింద్రాబాద్ బొల్లారం ఫుట్బాల్ గ్రౌండ్లో తెలంగాణ బాక్సింగ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో నంద్యాల జిల్లా క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 15 పతకాలు సాధించారు.
కబ్, సబ్ జూనియర్ విభాగాలలో జరిగిన పోటీలలో జయశ్రీ, యశ్వంత్ నాయక్, చంద్రకాంత్ ఆచారి, నంద సాత్విక్ రెడ్డి, దీపిక, లక్ష్మీ షర్మిల, జ్ఞాన ప్రసన్న స్వర్ణ పతకాలు సాధించారు. తపస్వి భాయ్, సుశాంత్, పూజిత రజత పతకాలు గెలుచుకోగా, వైష్ణవి, మణి చరణ్, ధీరజ్, లక్ష్మణ్, హరిప్రియ కాంస్య పతకాలు అందుకున్నారు. విజేతలు అవుకు మదర్ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన విద్యార్థులు.
విజేతలను అభినందిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ జి రవికృష్ణ, కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావు పాల్గొన్నారు. కోచ్లు ఫయాజ్, చంద్ర, ప్రసాద్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీమోహన్ను సత్కరించారు.
డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నంద్యాలలో బాక్సింగ్ క్రీడాభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. డాక్టర్ మధుసూదన రావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక వికాసం, శారీరక దృఢత్వం పెరుగుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
