ప్రతి పాఠశాలలో న్యూట్రీషన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలి

ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-7 కింద మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలి

ఫిబ్రవరి 10వ తేదీలోపు బిల్లుల అప్లోడింగ్ పూర్తి చేయాలి

  • జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 04 :
పిఎం శ్రీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా న్యూట్రీషన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో, పిఎం శ్రీ పాఠశాలల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫేజ్–1, ఫేజ్–2, ఫేజ్–7 కింద మంజూరైన పనుల పురోగతిపై ప్రధానోపాధ్యాయులు, సమగ్ర శిక్ష ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఈఓ జనార్దన్ రెడ్డి, ఎస్‌ఎస్‌ఏ పీఓ నిత్యానంద రాజు, సమగ్ర శిక్ష ఈఈ సంపత్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు విడుదల చేస్తోందన్నారు. అందుకు అనుగుణంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ, మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని ప్రధానోపాధ్యాయులు, సమగ్ర శిక్ష ఇంజనీర్లను ఆదేశించారు. ఫేజ్–1 పనులకు సంబంధించి ఇంకా రూ.9.53 లక్షల మేర వ్యయం చేయాల్సి ఉందని, ఆ నిధులతో పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న న్యూట్రీషన్ గార్డెన్లు, మరుగుదొడ్లు, వర్షపు నీటి సంరక్షణ (రెయిన్ హార్వెస్టింగ్) తదితర పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఫేజ్–2 కింద మొత్తం 24 పనులకు మంజూరు చేయగా, కెమిస్ట్రీ ల్యాబ్, కంప్యూటర్ రూమ్, లైబ్రరీ, బయాలజీ ల్యాబ్ వంటి సదుపాయాలకు సంబంధించి ఇంకా రూ.2 కోట్ల 30 లక్షల వ్యయం చేయాల్సి ఉందన్నారు. ఈ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తైన అనంతరం పాఠశాలకు అవసరమైన ప్రత్యామ్నాయ వసతుల కల్పనకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు ఈ–ఆఫీస్ ద్వారా ఫైల్ సమర్పించాలని సూచించారు. ముఖ్యంగా ఫిబ్రవరి 10వ తేదీలోపు బిల్లుల అప్లోడింగ్ తప్పనిసరిగా పూర్తి చేయాలని, లేనిపక్షంలో బిల్లులు అప్లోడ్ చేసే అవకాశం ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫేజ్–7 కింద 21 పనులకు మంజూరు చేయగా, వాటి కోసం రూ.2.14 కోట్ల నిధులు కేటాయించారని, అందులో భాగంగా రూ.50 లక్షల మేర వ్యయం చేసేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

జిల్లాలోని 44 పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మూడు విడతలుగా పనులు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఫేజ్–3 కింద మంజూరైన నాలుగు పాఠశాలలను మినహాయించి, మిగిలిన 40 పాఠశాలల్లో చేపట్టిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను కలెక్టర్ ఆదేశించారు.

Scroll to Top