అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యత నిర్మూలనే లక్ష్యం

ఈ ఏడాది 1,00,686 మందిని అక్షరాస్యులుగా మార్చే లక్ష్యంతో చర్యలు

అక్షరాంధ్ర కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 04 :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “అక్షరాంధ్ర” కార్యక్రమం ద్వారా జిల్లాలోని నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని విశ్వ నగర్ లోని అక్షరాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మొత్తం 1,00,686 మందిని అక్షరాస్యులుగా మార్చడం లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులను గుర్తించి, వారికి అక్షరాస్యత శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా మెప్మా (మెప్మా) పరిధిలోని స్వయం సహాయక బృందాల సభ్యుల్లో 25,000 మందిని, డీఆర్‌డీఏ (డిఆర్డిఎ) ద్వారా 50,000 మందిని, ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజిఎస్) పరిధిలో 25,686 మంది కూలీలను అక్షరాస్యత శిక్షణ కోసం ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎంపికైన లబ్ధిదారులకు మొత్తం 100 గంటల పాటు చదవడం, రాయడం, ప్రాథమిక గణితం (కూడికలు, తీసివేతలు)పై శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణను ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల ద్వారా నిర్వహిస్తున్నామని, ఇందుకోసం అవసరమైన పాఠ్య పుస్తకాలు, వర్క్ షీట్లు అందజేయడంతో పాటు, వీడియో పాఠ్యాంశాల ద్వారా కూడా బోధన కొనసాగుతున్నట్లు తెలిపారు.

శిక్షణ అనంతరం లబ్ధిదారుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఫిబ్రవరి చివరి వారంలో ప్రీ-ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు, అలాగే మార్చి 29వ తేదీన NIOS ఫైనల్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ వయసులో చదువు అవసరమా అనే సందేహాలు పక్కనపెట్టి, అక్షరాస్యత వల్ల భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని జిల్లా కలెక్టర్ కోరారు. చదువు ద్వారా వ్యక్తిలో ఆత్మవిశ్వాసం పెరిగి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకునే అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. జిల్లా అక్షరాస్యత రేటును గణనీయంగా పెంచేందుకు అధికారులు, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసి, జిల్లాను అక్షరాస్య జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆమె స్పష్టం చేశారు.

Scroll to Top