జాతీయస్థాయి దివ్యాంగ క్రీడా పోటీలకు ఎంపికైన నంద్యాల జిల్లా క్రీడాకారులు

నెల్లూరులో రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ లో విజేతలుగా నిలిచిన శ్రీనివాసులు,గౌతమ్,ఇమ్రాన్.

సత్కరించిన నంద్యాల లయన్స్ క్లబ్,నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 02 :

     నెల్లూరులో ఏ.సీ. సుబ్బారెడ్డి స్టేడియంలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పారా స్పోర్ట్స్ ( దివ్యాంగ క్రీడలు) అథ్లెటిక్ పోటీలలో నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరపున పాల్గొన్న చిందుకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు  డిస్కస్ త్రో, జావలిన్ రెండింటిలో బంగారు పతకం సాధించగా, రుద్రవరం కు చెందిన గౌతమ్ షాట్ పుట్ లో స్వర్ణ పతకం,జావలిన్ లో రజత పతకం అందుకోగా,ఆత్మకూరు కు చెందిన ఇమ్రాన్ లాంగ్ జంప్ లో కాంస్య పతకం సాధించాడు.

         ఈ సందర్భంగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం తరపున ముగ్గురు దివ్యాంగ క్రీడాకారులను శాలువా, జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు.

     ఈ సందర్భంగా నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు  డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల జిల్లా దివ్యాంగ క్రీడాకారులు  రాష్ట్రస్థాయి దివ్యాంగ అథ్లెటిక్స్ పోటీలలో విజేతలుగా నిలిచి ఫిబ్రవరి నెలలో భువనేశ్వర్ లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున పాల్గొనడానికి ఎంపిక కావడం ప్రశంసనీయమన్నారు. వీరు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనడానికి నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ఆర్థిక సహకారం అందించడం జరిగిందని దానిని  సద్వినియోగం  చేసుకుని తమ ప్రతిభతో విజేతలుగా నిలవడం హర్షనీయమని అన్నారు. జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడానికి కూడా సహకారం అందజేస్తామని ప్రకటించారు. జాతీయ స్థాయి పోటీలలో కూడా విజయం సాధించి రాష్ట్రానికి, నంద్యాల జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.దివ్యాంగులు క్రీడలలో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేసి ప్రోత్సహిస్తామని అన్నారు.

      విజేతలుగా నిలిచిన దివ్యాంగ క్రీడాకారులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తమకు అందిస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు.

       ఈ అభినందన కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పి.వి.రమణయ్య, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నిజాముద్దీన్,కోశాధికారి అమిదేల జనార్ధన్, సభ్యులు మేడా చంద్రశేఖర్, రామయ్య, కార్యాలయ కార్యదర్శి ఆలా మధు పాల్గొన్నారు.

Scroll to Top