


సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 02 :
భూసమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని వాటి ద్వారా 272 అర్జీలు స్వీకరించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించారన్నారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ మాట్లాడుతూ భూ సమస్యల శాశ్వత పరిష్కారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటి ద్వారా భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తం 272 అర్జీలు స్వీకరించగా, అందులో రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయ సేవలకు సంబంధించినవి-6, అడంగల్ సవరణలకు సంబంధించినవి-72, చుక్కల భూముల క్రమబద్ధీకరణ, 22-ఎ భూములకు సంబంధించినవి-35, అసైన్డ్ భూములు, భూఆక్రమణలకు సంబంధించినవి-47, రెవెన్యూ కోర్టు విచారణలు, ఆర్ఓఆర్కు సంబంధించినవి-28, సర్వే, రీ-సర్వేకు సంబంధించినవి-64, దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించినవి-20 దరఖాస్తులు వచ్చాయన్నారు. స్వీకరించిన అన్ని సమస్యలను ప్రత్యేక శ్రద్ధతో త్వరితగతిన పరిష్కరిస్తామని డిఆర్ఓ తెలిపారు.
