ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట

అర్జీదారుల సౌకర్యార్థం నూతన వసతులు

నంద్యాల కలెక్టరేట్‌లో నూతన ‘రెవెన్యూ క్లినిక్’ మరియు సేవా కౌంటర్ల ప్రారంభం

అర్జీదారులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 31 :

జిల్లాలో ప్రజల రెవెన్యూ సంబంధిత సమస్యలను వేగవంతంగా, సులభంగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నూతన రెవెన్యూ క్లినిక్ మరియు సేవా కౌంటర్లను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శనివారం ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని పీజిఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ల ప్రారంభ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా నలుమూలల నుండి తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో నూతన షెడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలకు కనీస వసతులు కల్పించడం జిల్లా పరిపాలన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నూతన కౌంటర్ల ద్వారా అర్జీల స్వీకరణ ప్రక్రియ మరింత సరళంగా, పారదర్శకంగా మారుతుందని, అలాగే సమస్యల పరిష్కారానికి కావాల్సిన సమయం కూడా తగ్గుతుందని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, వృద్ధులు మరియు దివ్యాంగులు వ్యయ ప్రయాసలు లేకుండా తమ సమస్యలను త్వరగా విన్నవించుకునేలా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

ఈ నూతన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విభాగాలు

●దివ్యాంగులు మరియు పింఛన్ సమస్యల సహాయ కేంద్రం: వృద్ధులు, శారీరక ఇబ్బందులు ఉన్న దివ్యాంగులు ఎక్కువసేపు వేచి ఉండకుండా తమ సమస్యలను త్వరితగతిన నమోదు చేసుకునేలా ప్రత్యేక కౌంటర్.

●రెవెన్యూ క్లినిక్ (Revenue Clinic): భూ సంబంధిత అంశాలు సహా ఇతర రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం.

●రెవెన్యూ అర్జీల నమోదు & పరిష్కార కేంద్రాలు: రెవెన్యూ అర్జీలను స్వీకరించడం, వాటి ప్రస్తుత స్థితిని తెలియజేయడం కోసం వేర్వేరు కౌంటర్లు.

●ఇతర అర్జీల నమోదు కేంద్రం: రెవెన్యూయేతర సాధారణ సమస్యలపై వచ్చే అర్జీల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్.

●విశ్రాంతి మరియు వేచి ఉండే స్థలం: అర్జీదారులు తమ వంతు వచ్చే వరకు సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేసిన విశాలమైన వెయిటింగ్ హాల్.

●అన్నదాన షెడ్: మధ్యాహ్న సమయంలో అర్జీదారులు ఆకలితో ఇబ్బంది పడకుండా భోజన సదుపాయం కల్పించేందుకు ప్రత్యేకంగా నిర్మించిన షెడ్.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కార ప్రక్రియ మరింత ప్రజాభిముఖంగా మారుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Scroll to Top