పేద ప్రజలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 31 : (గోస్పాడు)

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వివిధ రకాల పెన్షన్లను పెద్ద ఎత్తున పంపిణీ చేస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ తెలిపారు. శనివారం నంద్యాల జిల్లా గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా తో కలిసి మంత్రి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 1వ తేదీననే వివిధ కేటగిరీల కింద పెన్షన్ల మొత్తాలను లబ్ధిదారుల ఇంటి వద్దకే అందజేస్తోందని అన్నారు. ఒకటో తేది ఆదివారం లేదా ప్రభుత్వ సెలవు దినమైతే, ఒక రోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితర వర్గాలకు నెలకు రూ.4,000, రూ.6,000, రూ.10,000 చొప్పున పెన్షన్లు నిరంతరాయంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రత్యక్షంగా స్వీకరించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. జిల్లెల్ల గ్రామంలో తాగునీటి సమస్య, చెరువు పునరుద్ధరణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రజకులు ఇబ్బంది పడకుండా చెరువుకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా పరిష్కరిస్తామని అన్నారు. అలాగే రోడ్ల విస్తరణలో భాగంగా నిర్మాణాలు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించడంతో పాటు నష్ట పరిహారం కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధికి అధికారులు, ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలని గ్రామ పెద్దలను కోరారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్య పరిష్కారం, చెరువుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల ద్వారా సమీక్షించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Scroll to Top