

కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ర్యాబీస్ వ్యాక్సినేషన్ ప్రారంభం
సత్యం వార్త / నంద్యాల / జనవరి 29 :
పట్టణంలోని క్రాంతి నగర్ ప్రాంతంలో వీధి కుక్కల సమస్యపై మున్సిపాలిటీ బలమైన చర్యలు చేపట్టింది. ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న గురువారం క్రాంతి నగర్‌కు వెళ్లి, కుక్కల ర్యాబీస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను దగ్గరుండి పరిశీలిస్తూ స్వయంగా ప్రారంభించారు.
కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అక్కడికక్కడే ర్యాబీస్ టీకాలు వేయించి, టీకా వేసిన కుక్కలను అదే ప్రాంతంలో తిరిగి వదులుతున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి వారం బుధవారం, గురువారం, శుక్రవారం రోజుల్లో ర్యాబీస్ వ్యాక్సినేషన్ నిర్వహిస్తామని, సోమవారం, మంగళవారం, శనివారం రోజుల్లో కుక్కల నియంత్రణ చర్యలు, ఆపరేషన్లు కొనసాగుతాయని వెల్లడించారు. కుక్కల సమస్యను శాస్త్రీయంగా, మానవీయంగా పరిష్కరించడమే మున్సిపాలిటీ లక్ష్యమని తెలిపారు.
క్రాంతి నగర్‌తో పాటు పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో కుక్కలు అధికంగా ఉన్న ప్రాంతాల వివరాలను ప్రజలు శానిటేషన్ సూపర్వైజర్ మురళీధర్, ఇన్‌స్పెక్టర్లు లక్ష్మినారాయణ, శివప్రసాద్ రెడ్డి లేదా ఇతర మున్సిపల్ సిబ్బందికి వెంటనే తెలియజేయాలని కమిషనర్ కోరారు. ప్రజల సహకారంతో వీధి కుక్కల సమస్యను సమర్థవంతంగా నియంత్రిస్తామని ఆయన తెలిపారు.
