




ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్
అన్న క్యాంటీన్లో టోకెన్ తీసుకొని భోజనం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 28 :
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో పరిశుభ్రతను కట్టుదిట్టంగా పాటిస్తూ, నిర్ణీత సమయానికి భోజన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదేశించారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగది, భోజనశాల, ఆహార తయారీ విధానం, పరిశుభ్రత నిర్వహణ తీరును సమగ్రంగా పరిశీలించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లు పేదలు, కార్మికులు, దినసరి వేతనదారులకు ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమమని పేర్కొన్నారు. ఈ క్యాంటీన్లలో ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్, చట్నీ, సాంబార్ లను కేవలం రూ.5 లకే అందించడంతో పాటు, మధ్యాహ్నం మరియు రాత్రి భోజనంగా అన్నం, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి తప్పనిసరిగా అందించాలన్నారు. అన్న క్యాంటీన్లను నిత్యం శుభ్రపరుస్తూ, పరిశుభ్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భోజనం చేసిన వెంటనే ప్లేట్లు, గ్లాసులు తదితర పాత్రలను శుభ్రపరచడంతో పాటు, వంటగది పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా అన్న క్యాంటీన్లో టోకెన్ తీసుకొని భోజనం చేసి, భోజన నాణ్యత, రుచి, సమయపాలనపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆహార పట్టికలు, రిజిస్టర్లు తదితర రికార్డులను పరిశీలించి, లోపాలు లేకుండా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచనలు జారీ చేశారు.
