

శిలాఫలకాలు వేయాలని కౌన్సిలర్ల డిమాండ్
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 27 :
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో తమ ఐదేళ్ల పదవీ కాలం త్వరలో పూర్తవుతున్న నేపథ్యంలో, తమ వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు వెంటనే శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు ఛైర్ పర్సన్ మాబున్నిసా దృష్టికి తీసుకెళ్లారు.
మంగళవారం నంద్యాల మున్సిపల్ హాల్లో ఛైర్ పర్సన్ మాబున్నిసా అధ్యక్షతన, ఎమ్ ఈ గురప్పయాదవ్ ఆధ్వర్యంలో సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. మొదట అజెండా లోని 14 అంశాలపై చర్చించారు. అన్నిటికీ ఆమోదం తెలిపి నారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు పట్టణంలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో రోడ్ల విస్తరణ చేపట్టాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొన్ని వార్డుల్లో టెండర్లు పూర్తయ్యినా పనులు ప్రారంభం కావడం లేదని సభా దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఛైర్ పర్సన్ మాబున్నిసా, పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
12వ వార్డు కౌన్సిలర్ ఖండే శ్యాంసుందర్ లాల్ మాట్లాడుతూ తమ వార్డులో రూ.70 లక్షల విలువైన పనులకు శంకుస్థాపనలు చేసినప్పటికీ ఒక్క పని కూడా ప్రారంభం కాలేదని తెలిపారు. దీనిపై ఛైర్ పర్సన్ స్పందిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పట్టణ అభివృద్ధిని మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రతి వార్డులో అమలు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే పట్టణంలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ప్రజలకు, విలీన పంచాయతీలకు నిరంతర తాగునీటి సరఫరా కల్పించేందుకు రూ.38 కోట్ల 75 లక్షల వ్యయంతో తాగునీటి పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకంలో నీటి శుద్ధి కేంద్రం, పైకప్పు నీటి నిల్వ ట్యాంకులు, పైపు లైన్లు, పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నారు. పనుల అమలుకు అవసరమైన స్థలాలను ప్రజారోగ్య మరియు పురపాలక ఇంజనీరింగ్ శాఖకు అప్పగించేందుకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
ఈ పథకం ద్వారా నంద్యాల పట్టణంతో పాటు విలీన పంచాయతీల్లో తాగునీటి సరఫరా మరింత మెరుగుపడనుంది.
ఈ సమావేశంలో డీఈలు నాగభూషణ్ రెడ్డి, పవన్ కుమార్, రసూల్, ఆర్ఓ వెంకట రెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ మురళీధర్, ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ,ర శివప్రసాద్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
