రెవెన్యూ ఆదాయ లక్ష్యాలను వందశాతం అధిగమించాలి – జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 27 :
జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులైన ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, రవాణా శాఖలకు కేటాయించిన వార్షిక ఆదాయ లక్ష్యాలను వందశాతం సాధించడమే కాకుండా అధిగమించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఆదాయ వనరుల పెంపుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని శాఖల వారీగా ఆదాయ సాధన పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్‌తో పాటు ఎక్సైజ్, మైనింగ్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్, రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆదాయం సృష్టించే శాఖల్లో వనరుల సమర్థ వినియోగం, క్షేత్రస్థాయి పర్యవేక్షణ, లక్ష్య సాధనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కేటాయించిన లక్ష్యాలను సాధించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా కఠిన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. మైనింగ్ శాఖకు సవరించిన ఆర్థిక లక్ష్యం రూ.250.50 కోట్లుగా ఉండగా, డిసెంబర్ వరకు కేవలం రూ.178 కోట్లు మాత్రమే సాధించారని కలెక్టర్ తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని చేరుకునేందుకు మైనింగ్ శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణతో కృషి చేయాలని సూచించారు. వాణిజ్య పన్నుల శాఖలో గత ఏప్రిల్ నుండి జనవరి వరకు నిర్ణయించిన రూ.618.31 కోట్ల లక్ష్యానికి గాను రూ.496.02 కోట్లు మాత్రమే సాధించారని, ఇంకా సుమారు రూ.120 కోట్ల లక్ష్యం మిగిలి ఉన్నందున దానిని త్వరితగతిన సాధించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
రిజిస్ట్రేషన్ శాఖ విషయానికి వస్తే, రూ.202 కోట్ల లక్ష్యాన్ని మించి రూ.210 కోట్లు సాధించినట్లు అధికారులు కలెక్టర్‌కు నివేదించారు. మార్చి నెలాఖరుకు ఈ ఆదాయాన్ని రూ.230 కోట్లకు పెంచగలమని సబ్-రిజిస్ట్రార్‌లు ఆశాభావం వ్యక్తం చేశారు. రవాణా శాఖ ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు రూ.120.40 కోట్ల లక్ష్యానికి గాను రూ.88.42 కోట్లు మాత్రమే వసూలైనట్లు రవాణా శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మిగిలిన లక్ష్య సాధనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎక్సైజ్ శాఖకు కేటాయించిన రూ.1200 కోట్ల వార్షిక లక్ష్యాన్ని అధిగమించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటూ రెవెన్యూ ఆదాయ శాఖల్లో వృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆదాయం తెచ్చిపెట్టే వనరులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, లక్ష్య సాధనలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా కట్టుదిట్టంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

Scroll to Top