




సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 23 :
శ్రీ సంకల్ప్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ , శ్రీ శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలు సంప్రదాయం, సంస్కృతి, ఆధునిక సాంకేతికత సమ్మేళనంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ప్రవేశ ద్వారం నుంచే ప్రత్యేకంగా మూడు వృత్తాకార అలంకరణలు ఏర్పాటు చేశారు. మొదటి వృత్తంలో “అమ్మ”, రెండవ వృత్తంలో “నాన్న”, మూడవ వృత్తంలో “ఇల్లు” అని రాసి, పిల్లల జీవితంలో కుటుంబ ప్రాధాన్యతను ప్రతీకాత్మకంగా చూపించారు. అనంతరం, సీతాకోకచిలుక (బటర్‌ఫ్లై) ఆకృతిలో పాఠశాల పేరును ఏర్పాటు చేయడం ద్వారా, శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్లో చదువుకుంటూ పిల్లలు సీతాకోకచిలుకలా రెక్కలు విప్పి ఎగిరే అందమైన భవిష్యత్తును పొందాలన్న సందేశాన్ని తెలియజేశారు. బటర్‌ఫ్లై థీమ్‌తో రూపొందించిన సెల్ఫీ బోర్డ్ విద్యార్థులు, తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకుంది. వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం కార్యక్రమం పూజారులచే శాస్త్రోక్తంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సుధాకర్, రమ్య రెడ్డి పాల్గొని చిన్నారులకు తొలి అక్షరాలను పరిచయం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి. చిన్నారుల నృత్యాలు, పాటలు, ప్రదర్శనలు అందరినీ అలరించాయి.
కార్యక్రమంలో చైర్మన్ శ సుధాకర్ మాట్లాడుతూ, విద్యతో పాటు విలువలు, సృజనాత్మకత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పిల్లలకు ఎంత అవసరమో వివరించారు. ప్రతి విద్యార్థి తనలోని ప్రతిభను గుర్తించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
వేడుకలో మరో వినూత్న అంశంగా, తల్లిదండ్రులకు 1 నుంచి 30 వరకు నంబర్లు ఇచ్చి తమ పిల్లల కోసం ఒక నంబర్‌ను ఎంచుకునే అవకాశం కల్పించారు. ఆ నంబర్ ఆధారంగా పిల్లల భవిష్యత్తు వృత్తి అంచనాను వెల్లడించారు. అనంతరం, ఏఐ (AI) సాంకేతికత సహాయంతో, ఆ వృత్తికి అనుగుణంగా పిల్లల ఫోటోలను తక్షణమే రూపొందించి చూపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ ప్రత్యేక కార్యక్రమం తల్లిదండ్రులు, విద్యార్థుల్లో అపారమైన ఆనందం, ఉత్సాహాన్ని నింపింది. సంప్రదాయాలతో పాటు ఆధునికతను సమన్వయం చేస్తూ విద్యాబోధన అందించడమే శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ లక్ష్యమని ఈ వసంత పంచమి వేడుక మరోసారి నిరూపించింది.
