పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద రోటీ మేకర్ యూనిట్ ప్రారంభం

ఆహార శుద్ధి రంగంలో స్వయం ఉపాధికి విస్తృత అవకాశాలు

  • జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 23 :  

పీఎంఎఫ్‌ఎంఈ (ప్రధాన మంత్రి ఫార్మాలిసెషన్ అఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంట్రప్రెస్స్) పథకం కింద ఏర్పాటు చేసిన రోటీ మేకర్ యూనిట్‌ను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శుక్రవారం నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ప్రాంతంలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో అల్ల రామిరెడ్డి ద్వారా ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, ఆహార శుద్ధి రంగంలో నంద్యాల జిల్లాలో గణనీయమైన ప్రగతి సాధించబడుతోందని తెలిపారు. పీఎంఎఫ్‌ఎంఈ పథకం ప్రధాన లక్ష్యం “ఒక్కో ఇంటి నుంచి ఒక చిన్న పారిశ్రామికవేత్తను తయారు చేయడం” అని స్పష్టం చేశారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు యూనిట్ వ్యయంపై 35 శాతం సబ్సిడీతో పాటు, బ్యాంకుల ద్వారా 90 శాతం వరకు రుణ సౌకర్యం కల్పించబడుతుందని, లబ్ధిదారుడు కేవలం 10 శాతం మాత్రమే స్వంత వాటాగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ పథకం ద్వారా రోటీ మేకింగ్ యూనిట్లతో పాటు ఐస్‌క్రీమ్ తయారీ, పచ్చళ్ల తయారీ, బేకరీలు, నూడుల్స్ తయారీ, పానీపూరి తయారీ వంటి వివిధ రకాల ఆహార శుద్ధి యూనిట్లను ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేవలం తయారీ దశకే పరిమితం కాకుండా, బ్రాండింగ్, మార్కెటింగ్, మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ఈ పథకం ద్వారా పూర్తి స్థాయి సహకారం అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నంద్యాల జిల్లాలో మొత్తం 188 యూనిట్లకు మంజూరు లభించగా, వాటిలో 70 యూనిట్లు ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయని, అదనంగా మరో 50 మంది లబ్ధిదారులను గుర్తించామని తెలిపారు. ఈ పథకాన్ని వ్యక్తిగత లబ్ధిదారులతో పాటు స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు. అర్హత గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగరాజు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top