
సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 22 :
కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపై నంద్యాల జిల్లా శిరివెళ్ల మెట్ట వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఎఆర్ బీసీవీఆర్ ప్రైవేటు బస్సు మంటల్లో కాలి బూడిదైంది. బస్సు వెనుక టైర్ అకస్మాత్తుగా పేలడంతో వాహనం అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి క్షణాల్లో మొత్తం వాహనం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన అర్ధరాత్రి 1.40 గంటల సమయంలో జరిగినట్లు ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
