

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 22 :
నంద్యాల మండలంలోని కానాల చెరువును జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువుకు సంబంధించి ఉన్న నాలుగవ స్లూయిస్ ప్రాంతాన్ని సందర్శించి, కేసి కెనాల్ కార్యనిర్వాహక ఇంజనీర్ నుండి సంబంధిత సాంకేతిక, పరిపాలనా వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కానాల చెరువు కింద మొత్తం మూడు స్లూయిసులు ఉండగా, ఈ చెరువు ద్వారా సుమారు 800 ఎకరాల ఆయకట్టు సాగునీటి లబ్ధి పొందుతోందని ఈఈ ప్రతాప్ కలెక్టర్ కు వివరించారు. గతంలో అనధికారికంగా నిర్మించబడిన నాలుగవ స్లూయిస్‌ను 2019 సంవత్సరంలో గౌరవ న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మూసివేయడం జరిగిందని తెలిపారు. మూసివేసిన నాలుగవ స్లూయిస్ పునరుద్ధరణకు సంబంధించి రైతుల నుండి వినతులు అందిన నేపథ్యంలో, ఈ అంశం పూర్తిగా న్యాయస్థాన పరిధిలో ఉన్నదని పేర్కొంటూ, జిల్లా కలెక్టర్ పరిశీలన నిర్వహించి, ప్రస్తుత పరిస్థితులు, సాధ్యాసాధ్యాలపై సంబంధిత శాఖాధికారుల నుండి నివేదికలు కోరారు. న్యాయస్థానం ఉత్తర్వులకు లోబడి, చట్టపరమైన నిబంధనలను అనుసరించి తదుపరి చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు
