నంద్యాలలో మీడియా విలేకరిపై దౌర్జన్యం, బెదిరింపులు అమానుషం – SDPI తీవ్ర ఖండన

సత్యం వార్త / నంద్యాల / జనవరి 19 :
నంద్యాల జిల్లాలో ఒక మీడియా విలేకరిపై జరిగిన దౌర్జన్యం మరియు బెదిరింపుల ఘటనను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సందర్భంగా SDPI నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాస్ హుస్సేన్ మాట్లాడుతూ జర్నలిస్టు ఇంటి దగ్గరకు వెళ్లి కేకలు వేస్తూ ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం అత్యంత అమానుషమైన, ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్య అని అన్నారు.
మీ పార్టీకి గానీ, మీ అభిప్రాయాలకు గానీ వ్యతిరేకంగా ఒక జర్నలిస్టు మాట్లాడితే, చట్టపరంగా లీగల్ యాక్షన్ తీసుకునేందుకు పూర్తి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలా చేయకుండా, అధికారం చేతుల్లో ఉందన్న నెపంతో భౌతికంగా దాడులు చేయడం స్పష్టమైన అధికార దుర్వినియోగమని విమర్శించారు.
నంద్యాల SDPI అసెంబ్లీ అధ్యక్షులు ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ, ఒక మీడియా స్వేచ్ఛను అణిచి వేయడానికి చేసే ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదమని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోనుకాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా గట్టిగా డిమాండ్ చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో SDPI జిల్లా అధ్యక్షులు మణిహారం హనీఫ్ , మరియు అసెంబ్లీ నాయకులు మజీద్ ఖాన్, మరియు మక్బూల్ హుస్సేన్, సులేమాన్ , కరీముల్లా, షేక్షావలి ,షరీఫ్,అక్తర్ హుస్సేన్ , పాల్గొన్నారు.

Scroll to Top