ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు బిజెపి వినతులు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 19 :
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా బిజెపి జనతా వారధి కార్యక్రమం సందర్భంగా నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు ఆధ్వర్యంలో మొత్తం 8 అర్జీలను కలెక్టర్‌కు అందజేశారు.
కృష్ణాపురం గ్రామంలో గట్టిపాక విద్యుత్ ఘాతంతో ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో పాటు పశువులు మృతి చెందిన ఘటనపై బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని వినతిపత్రం ఇచ్చారు. యల్లూరు గ్రామంలో యూరియా కొరత తీవ్రంగా ఉండటంతో రైతులకు సరైన సమయంలో యూరియా అందించి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
పాణ్యం మండలం బోనాల లక్ష్మమ్మ భూమి ఐదు ఎకరాలు గ్రీన్ కో సంస్థకు ఇచ్చిన నేపథ్యంలో రావాల్సిన నష్ట పరిహారం ఇప్పించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్ నగర్ కాలనీలో సుంకుల పరమేశ్వరి దేవాలయ భూముల ఆక్రమణపై విచారణ జరిపి న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు.
వికలాంగుల పెన్షన్ మంజూరు, యల్లూరు గ్రామంలో సంత నిర్వహణకు అవసరమైన సదుపాయాలు కల్పించి స్థలం కేటాయింపు, నంద్యాల కూరగాయల మార్కెట్‌లో గతంలో ఉన్న టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే యల్లూరు గ్రామంలో పలువురు రైతుల పొలాలు ఆన్లైన్‌లో నమోదు కాకపోవడంతో వాటిని వెంటనే ఆన్లైన్‌లో చేర్చాలని వినతిపత్రం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కశెట్టి చంద్రశేఖర్, జనతా భారతి జిల్లా కన్వీనర్, జిల్లా ఉపాధ్యక్షులు పసపుల రవీంద్రనాథ్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరెడ్డి, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటేష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీధర్, గోస్పాడు మండల అధ్యక్షులు మధుబాబు, జనతా వారధి కో కన్వీనర్ సుదర్శన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top