


రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 183 అర్జీలు, పిజిఆర్ఎస్ లో 328 దరఖాస్తుల స్వీకరణ
జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 12 :
ప్రజా వినతులను సత్వరమే నాణ్యతతో పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పిజిఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో డిఆర్ఓతో పాటు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఎం సుబ్బారెడ్డి, డిఆర్డిఎ పిడి శ్రీధర్ రెడ్డి ఇతర అధికారులు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అదేవిధంగా రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలకు సంబంధించిన 183 దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రజా వినతుల పట్ల ప్రత్యేక దృష్టిసారించి వాటిని త్వరితగతిన నాణ్యతతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అర్జీలు పరిష్కారంలో బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా నిర్ణీత గడువులోగా అర్జీల పరిష్కారం పై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అర్జీల పరిష్కార విషయంలో ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని సదరు విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అర్జీదారులకు ఇచ్చిన అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారణ దిశగా కృషి చేయాలన్నారు. అంతేకాకుండా రీఓపెన్ అర్జీలను సంబంధిత అర్జీదారుడితో మాట్లాడి విషయాన్ని పూర్తిగా తెలుసుకొని అర్జీని పరిష్కరిస్తామన్న నమ్మకాన్ని వారికి కలిగించాలన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా స్వీకరించిన 183 అర్జీలలో అడంగల్ సవరణకు సంబంధించి 52, చుక్కల భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి 47, అసైన్డ్ మరియు భూ ఆక్రమణకు సంబంధించి 32, రెవెన్యూ-కోర్టు విచారణలకు సంబంధించి 16, సర్వే/రీసర్వేకు సంబంధించిన సమస్యలు 31, దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించి 5 దరఖాస్తులు, అందాయన్నారు.
పిజిఆర్ఎస్ ద్వారా స్వీకరించిన కొన్ని ప్రజా సమస్యలు
మహానంది మండలం, గాజులపల్లె గ్రామానికి చెందిన స్మశానవాటికలో కంపచెట్లతో నిండిపోవడంతో పాటు మధ్యలో వాగు ఉండడం వల్ల స్మశానవాటికకు వెళ్లడానికి ఇబ్బందిగా మారిందని అందుకు వాటిని తొలగించి వంతెన నిర్మించగలరని డిఆర్ఓ అర్జీ సమర్పించారు.
మహానంది మండలం, గాజులపల్లె గ్రామానికి చెందిన రహమత్ బీ తన భర్త అనారోగ్యంతో మరణించినందువల్ల వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ డిఆర్ఓకు అర్జీ సమర్పించారు.
కొలిమిగుండ్ల మండలం, తిమ్మనాయునిపేట గ్రామానికి చెందిన తిరుమలగారి కొండయ్యకు గ్రామంలో సర్వే నెం.234/2లో 0.50 ఎకరాలు ఎన్హెచ్ రహదారికి పోవడం జరిగిందని అందుకు సంబంధించిన నష్టపరిహారాన్ని ఇప్పించగలరిని డిఆర్ఓకు దరఖాస్తు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 328 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు. స్వీకరించిన అర్జీలన్నింటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
